ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 123 మందికి ఆర్థిక సాయం – మంత్రి గొట్టిపాటి రవి కుమార్
బల్లికురువ: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అద్దంకి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు రూ. 2 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. దీనితో మొత్తం 123 మంది లబ్ధి పొందారని వెల్లడించారు.
- ఇప్పటి వరకు పంపిణీ వివరాలు:
- 33 మందికి రూ. 28 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు
- 22 మందికి రూ. 83 లక్షల ఎల్ఓసీలు
- నేడు, 57 మందికి రూ. 71 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు
- 11 మందికి రూ. 30 లక్షల ఎల్ఓసీలు
మంత్రిగారు పేర్కొన్నట్లుగా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఆరోగ్య రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ప్రజలను అనారోగ్యాంధ్రప్రదేశ్ దిశగా నడిపించిందని విమర్శించారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి నిస్వార్థంగా సేవలందిస్తున్నదని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని మంత్రి గొట్టిపాటి ప్రశంసించారు.
“మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మాత్రమే కాదు, హృదయపూర్వకంగా ప్రజల కోసం పనిచేసే మనసున్న ప్రభుత్వం కూడా,” అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.