Home » AP Cabinet: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..

AP Cabinet: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..

AP Cabinet approves drone policy: ముఖ్య నిర్ణయాలు

AP Cabinet Approves Drone Policy and Takes Key Decisions : డ్రోన్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు మారనుంది. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీని ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్నారు. 25వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 50 డ్రోన్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ రంగంలో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టే విద్యాసంస్థల‌కు రూ.20 ల‌క్షల ప్రోత్సాహం అందించనున్నారు.

గత సర్కారు హయాంలో అన్ని రంగాల్లో ఏపీ వెనుకబడిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. డ్రోన్ పాలసీ ద్వారా ఓర్వకల్లును డ్రోన్ల తయారీ హబ్‌గా మార్చాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. రూ.1000 కోట్ల పెట్టుబడి, రూ. 3000 కోట్ల రాబడి వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 25 వేల‌‌ మందికి ప్రత్యక్షంగానూ, మరో 25 వేల‌‌‌‌ మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఇండియా ఒక పెద్ద మార్కెట్ అని.. డేటా సెంటర్లు కావాలని మంత్రి చెప్పుకొచ్చారు. బొంబాయి, మద్రాసు, హైదరాబాద్‌లలో డేటా సెంటర్లు పెడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌ కంటే తక్కువగా భూముల విలువలు ఉన్నా మన రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదని మంత్రి చెప్పుకొచ్చారు. ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.Oకి మంత్రివర్గం ఆమోదం తెలిపింద్నారు. ఈ పాలసీ ద్వారా డేటా సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయన్నారు. . 2014-19 మధ్యలో ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని తెలిపారు. సెమీ కండక్టర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రారంభించే వారికి 50% సబ్సిడీ లేదా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటన విడుదల చేశారు. చిప్, సెమీకండక్టర్ తయారీకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి కొత్త చట్టం తీసుకు రావడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఏపీలో ఎలాంటి భూములు అయినా కొత్త చట్టం కిందకు వస్తాయన్నారు. కొత్త చట్టం కింద 10 నుంచీ 14 సంవత్సరాల‌ జైలు, ఆస్తి విలువ, ఆస్తి కూడా పెనాల్టీగా పొందుపరచామని పేర్కొన్నారు.

రూ. 4.57 లక్షల పనులకు సంబంధించి రూ. 331 కోట్ల విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. NREGS చట్టం ప్రకారం 12% వడ్డీ ఇవ్వాలి…ఈ అంశంపై చర్చించామని తెలిపారు. 01.11.2024 నుంచీ చట్టంలోని సెక్షన్ 3(1)(a) కింద జ్యూడీషియల్ అధికారుల‌ పదవీ విరమణ‌ వయసు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం 3 ఆర్డినెన్స్‌లు తెచ్చామని.. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్ట సవరణ చేస్తామని మంత్రి చెప్పారు. క్వాలిటీ లిక్కర్ తెచ్చేలా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. కుప్పం ప్రధాన కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కేబినెట్ ఆమోదించిందని మంత్రి వెల్లడించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. . 189 కిలోమీటర్ల పొడవైన ORR ను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీ సీఆర్‌డీఏ 8352.69 చ.కి.మీ లుగా పునరుద్ధరించేందుకు బాపట్ల, మంగళగిరిలలో కలిపిన మండలాలను తిరిగి సీఆర్డీఏలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. విద్యార్ధుల ఫీజు రీఇంబర్సుమెంట్ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని.. విద్యార్థుల ఫీజు నేరుగా కాలేజీ ఖాతాలకు పంపే విధానాన్ని పునరుద్ధరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పిఠాపురం ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు లభించేలా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకుందన్నారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ డ్యూటీ యాక్ట్‌ను సవరించడానికి నిర్ణయించామని తెలిపారు. 311 మంది పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ కేటాయించిన భూములను ఆమోదించిందన్నారు. ఇకపై ఏపీఐఐసీ నుంచీ భూముల కేటాయింపు 50 ఎకరాల వరకూ ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *