YS Vijayamma: వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదంపై తల్లి వైఎస్ విజయమ్మ వైఎస్సాఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాధేస్తుందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి, తాను, తన పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లమని.. కానీ, కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదన్నారు. అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్ని తన కళ్ళముందే జరిగి పోతున్నాయన్నారు. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నానని వైఎస్ విజయమ్మ వాపోయారు. దయచేసి ఈ కుటుంబం గురించి.. తన పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దని.. అనవసర దూషణలు చేయొద్దని ఆ లేఖలో విజయమ్మ తెలిపారు. వైఎస్సార్ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దని కోరారు. వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెల్లు.. ఇది వాళ్ళిద్దరి సమస్య.. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు.
వైఎస్సార్ ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు.. ఇంతటి వివాదం జరిగేది కాదన్న విజయమ్మ.. ఈ ఆస్తుల విషయంపై తాను ఇలా బహిరంగ లేఖ రావాల్సిన అవసరం పడేది కాదన్నారు. అయినా దీనిపై జరుగుతున్న రచ్చను చూసి.. తన మాటలు మాత్రమే ఆపుతాయనీ విశ్వసిస్తున్నాను.. తాను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. మరొక్కసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరినీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని వైఎస్ విజయమ్మ కోరారు.