Abortion Pills: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన అనంతరం ఆ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంంది మహిళలు 4B ఉద్యమం పేరుతో పురుషుల వల్లే ట్రంప్ గెలిచాడని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం పేరుతో పిల్లలు, శృంగారం, డేటింగ్ కు పురుషులను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. తాజాగా అబార్షన్ మాత్రల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే అబార్షన్ మాత్రల కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చినట్లు తెలిసింది. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును నిషేధిస్తారంటూ వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందాక అబార్షన్ మాత్రలకు డిమాండ్ పెరిగింది. 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చినట్లు సమాచారం. ఇది రోజూ డిమాండ్ కంటే 17 రెట్లు ఎక్కువ అని వార్తలు వస్తున్నాయి. గర్భిణులు కానివారి నుంచే ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయని ఓ ఎన్జీవో పేర్కొంది. ఎన్నికలకు ముందు గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అన్న సమాచారం కోసం నిత్యం 4 వేల నుంచి 4,500 వరకు తమ వెబ్ సైట్ చూసేవారని.. ఎన్నికల రిజల్ట్ చూశాక భారీ మార్పు కనిపిస్తోందని మరో స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలా మంది మాత్రలు నిల్వ చేసుకుంటున్నట్లు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటనీ అభిప్రాయపడ్డారు.