Home » Trivikram Srinivas: సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను…

Trivikram Srinivas: సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను…

త్రివిక్రమ్ శ్రీనివాస్: దుల్కర్ నటనతో ప్రేమలో పడిపోయాను

Trivikram Speech At Lucky Baskhar Pre-Release Event: మంచి పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ తరం గొప్ప నటులు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ. వాళ్ళిద్దరినీ ఒకేసారి చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భాస్కర్ లక్కీ అవ్వాలని మనం సినిమా మొత్తం కోరుకుంటూనే ఉన్నాం. ఫైనల్‌గా అతను లక్కీ గానే బయటకు వస్తాడు. ఈ సినిమాకు లక్కీ భాస్కర్ అనే టైటిల్ యాప్ట్. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలను కూడా వెంకీ తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథని ప్రభావితం చేయకుండా సినిమాలో ఒక్క పాత్ర కూడా లేదు. బ్యాంక్ లో బయట నిలబడే సెక్యూరిటీతో సహా ప్రతి ఒక్కరూ మనకొక ఎమోషన్ క్రియేట్ చేసి వెళ్తారు ఈ సినిమాలో. దుల్కర్ సల్మాన్ వేరే లెవెల్‌లో యాక్ట్ చేశాడు. అంటే ఎఫర్ట్ లెస్‌గా చేశాడు. అంటే నిజంగా ఒక బ్యాంక్‌లోకి వెళ్ళిపోయి, క్లర్క్ జీవితంలోకి ఎంటరైతే ఎంత ఈజీ ఉంటుందో అంత ఈజీగా చేశాడు. మనల్ని కూడా చేయి పట్టుకొని తనతో పాటు బ్యాంక్ లోకి తీసుకెళ్లిపోయాడు. దుల్కర్ మామూలు నటుడు కాదు. అతను చేసిన ప్రయత్నం మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. మమ్మూట్టి లాంటి మర్రిచెట్టుకి పుట్టాడు. మర్రిచెట్టు కింద మొక్కలు బ్రతకవని చెబుతుంటారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి తన ప్రయాణాన్ని తను మొదలుపెట్టడం, తన రోడ్డు తను వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. మమ్ముట్టి గారు చాలా గొప్ప నటుడు. ఆయన దుల్కర్ కెరీర్ చూసి తండ్రిగా గర్వపడతారు.

ఈ సినిమాలోని ప్రతి పాత్ర నా మనసుకు దగ్గరైంది. ఈ సినిమాలో నేను అందరికంటే ఎక్కువ ఫ్యాన్ అయిపోయింది అంటే రాంకీ గారి పాత్ర. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక అడ్వెంచర్ చేస్తే నెగ్గాలని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో చాలామంది అక్కడినుండే వచ్చాము కదా. అడ్వెంచర్ చేసి, దాని నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడటం అనేది హోప్. ఆ హోప్ సినిమా చూసిన తర్వాత ఫైనల్‌గా కంప్లీట్ అవుతుంది. తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ లోనుంచి మీ అందరూ బయటకు వస్తారు. ఈ దీపావళి వెంకీకి, ఈ సినిమాకి పని చేసిన అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుందని నాకు తెలుసు. నేను నమ్ముతూ, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే విజయ్ గురించి రెండు మాటలు చెప్పాలి. నాకు బాగా ఇష్టమైన నటుల్లో ఒకడు. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. చాలా గట్టోడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాశారు. మా వాడే మహా గట్టివాడే అని.. మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు. దుల్కర్ గారిని నేను పెద్దగా కలవలేదు. షూటింగ్ కి వెళ్ళడం కంటే, ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూడటానికి ఇష్టపడతాను నేను. సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను. ఇండియన్ సినిమాకి మలయాళం సినిమా ఒక కొత్త యాంగిల్ క్రియేట్ చేసింది. అలాంటి ఒక న్యూ వేవ్ మలయాళం సినిమాలో ఒక మైల్ స్టోన్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమా నాగవంశీకి, వెంకీకి మంచి విజయాన్ని అందించాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.” అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *