Home » TGSRTC: టికెట్ చార్జీలు పెరిగాయ‌నే ప్రచారంలో వాస్తవం లేదు..

TGSRTC: టికెట్ చార్జీలు పెరిగాయ‌నే ప్రచారంలో వాస్తవం లేదు..

TGSRTC: టికెట్ చార్జీలు పెరిగాయ‌నే ప్రచారంలో వాస్తవం లేదు.

టీజీఎస్ఆర్టీసీ బ‌స్సు టికెట్ ధ‌ర‌లను పెంచింద‌ని జ‌రుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌లకు సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉన్నాయని టీజీఎస్‌ఆర్టీసీ సంస్థ తెలిపింది. దీపావ‌ళి తిరుగు ప్రయాణ ర‌ద్దీ నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం చార్జీల‌ను సంస్థ స‌వ‌రించిందని తెలిపింది.

ప్రధాన పండుగులు, ప్రత్యేక సంద‌ర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ యాజ‌మాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఆ బ‌స్సులు ఖాళీగా వెళ్తుంటాయి. ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగ‌లు, ప్రత్యేక సంద‌ర్భాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. గ‌త 21 ఏళ్లుగా అన‌వాయితీగా వ‌స్తోన్న ప్రక్రియ ఇది.

దీపావ‌ళి పండుగ స‌మ‌యంలో రెగ్యుల‌ర్ స‌ర్వీసుల ద్వారానే ప్రయాణికుల‌ను సొంతూళ్లకు చేర్చడం జ‌రిగింది. కానీ తిరుగు ప్రయాణంలో క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, త‌దిత‌ర ప్రాంతాల నుంచి హైద‌రాబాద్‌కి ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆది, సోమ‌వారం నాడు ర‌ద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌నుంచి హైద‌రాబాద్‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డపాల‌ని యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. ఆదివారం నాడు క‌రీంన‌గ‌ర్ రీజియ‌న్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, వ‌రంగ‌ల్ నుంచి 66, ఆదిలాబాద్ నుంచి 16 మొత్తంగా 360 ప్రత్యేక బ‌స్సుల‌ను హైద‌రాబాద్‌కు సంస్థ న‌డిపింది. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఆయా ప్రాంతాల‌నుంచి మ‌రో 147 స‌ర్వీసుల‌ను ఏర్పాటు చేసింది. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీల‌ను స‌వ‌రించ‌డం జ‌రిగింది. ఈ బ‌స్సులు మిన‌హా మిగ‌తా బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే అమ‌ల్లో ఉన్నాయి.

స్పెష‌ల్ స‌ర్వీసుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధ‌ర‌లను సవరించడం జ‌రుగుతుంద‌ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం మరోసారి స్పష్టం చేస్తుంది. సాధార‌ణ రోజుల్లో య‌థావిధిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే ఉంటాయి. స్పెష‌ల్ స‌ర్వీసుల‌కు టికెట్ ధ‌ర‌లను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *