TG Govt: ఐదున్నర గంటలు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 3500 ఇళ్లు పారదర్శకంగా ప్రతీ నియోజకవర్గంలో ఇస్తామని.. ప్రతీ గ్రామంలో కుల మత, పార్టీలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి ఇస్తామని తెలిపారు. దీపావళి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గతంలో లాగా మా పార్టీ, మా అనేది కాదు. పేద వాళ్లలో బహు పేదవాళ్లకు ఇండ్లు ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు పెండింగులో ఉన్నాయని.. ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు ఒక డీఏ వెంటనే ఇస్తామని మంత్రి వెల్లడించారు.
317, 46 జీవోలు గత ప్రభుత్వం విడుదల చేసిందని, దానివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. 317జీవోలో స్పౌజ్, హెల్త్ సమస్యలు, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ వెంటనే చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 317, 46జీవోలపై అసెంబ్లీలో చర్చిస్తామని.. క్లియరెన్స్ కోసం కేంద్రానికి పంపుతామన్నారు. కులాలకు సంబంధించి నవంబర్ 31 లోపు కుల గణన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 6 వేల సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయన్నారు. 20 వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లర్ల దగ్గర మిగిలి పోయిందని.. పక్క రాష్ట్రాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మిల్లర్ల దగ్గర బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో రెండో విడత 76.4 కిలోమీటర్లు 24269 కోట్లకు డీపీఆర్ తయారు చేశామని… పిపిపి విధానంలో నిర్మాణం ఉంటుందన్నారు. కొత్త మెట్రో రైలు మార్గానికి సంబంధించి కేంద్రానికి డీపీఆర్ పంపాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. కొత్త గ్రామీణ రోడ్లకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని శాఖల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. 25 నుంచి 28 వేల కోట్ల రూపాయలు అవసరమని.. ఇది కూడా పిపిపి విధానంలో నిర్మిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం గోషామాల్ భూములు కేటాయింపుకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. 3 ప్రాంతాల్లో స్కిల్ యూనివర్సిటీలకీ అనుబంధంగా ఐటీఐలు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కోర్టులకు సిబ్బంది నియామకం చేపడతామన్నారు. రిజర్వాయర్లలో సిల్ట్ పేరుకు పోయిందని.. సిల్ట్ తొలగింపు విషయంలో కడెం ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు.