Telangana: గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇకపై నూతన విధానం అమలుకానుంది. రహదారుల నిర్మాణ పనులకు హైబ్రిడ్ అన్యుటీ మోడ్ (హామ్) అమలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్ర్చర్ ప్రాజెక్టులకు ఇదే విధానం అమలవుతోంది. కేబినెట్‌కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రతిపాదించగా.. కేబినెట్ ఆమోదించింది.
గ్రామీణ ప్రాంతాల్లో త్వరితగతిన రోడ్ల నిర్మాణం కోసం సరికొత్త విధానానికి రాష్ట్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఆర్థిక విధి విధానాల ఖరారే తరువాయిగా ఉంది.
కొత్త విధానంలో శరవేగంగా గ్రామీణ రోడ్ల నిర్మాణం పూర్తికానుంది. గత ప్రభుత్వం అవలంభించిన విధానం వల్ల గ్రామ రహదారుల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని అంటున్నారు. పనులు పూర్తయినా గతంలో ఏండ్లుగా పెండింగ్‌లో బిల్లులు ఉన్నాయి. దీంతో కొత్త పనులకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. కాంట్రాక్టర్లకు బ్యాంక్ షూరిటీ ఇప్పించడం ద్వారా రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. నూతన విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. కొత్త పద్ధతితో పల్లె రోడ్లకు మహర్దశ రానుంది. పంచాయతీ రాజ్ శాఖలలో రహదారి పనులు పరుగులు పెట్టనున్నాయి.