Free Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుకగా సూపర్ సిక్స్‌లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకం అమలులోకి వచ్చింది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. నిన్నటి నుంచి దీపం -2 పథకం అమల్లోకి వచ్చింది. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ఈ సబ్సిడీ మొత్తాన్ని సీఎం అందించారు.
ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం సంస్థలకు చెక్కు అందించిన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపావళి నుండి అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల “దీపం-2 ” పథకంలో నమోదు కాబడినందున శుభాకాంక్షలు. మీ సబ్సిడీ అమౌంట్,మీరు సిలిండర్ డెలివరీ తీసుకున్న 48 గంటలలో మీ బ్యాంకు ఖాతా నందు జమ చేయబడుతుందని తెలియచేస్తున్నాము.” అని ఏపీ ప్రభుత్వం తరఫున నిన్నటి నుంచి వినియోగదారులకు సందేశాలు వస్తున్నాయి. గ్యాస్ బుకింగ్ సమయంలో డీలర్లకు వినియోగదారులకు డబ్బు చెల్లిస్తున్నారు. 48 గంటల తర్వాత తిరిగి వినియోగదారుల ఖాతాకు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.