Saddula Bathukamma 2024: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ పూల పండగ బతుకమ్మను ఊరూరా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రామాలతో పాటు, పట్టణాల్లో కూడా జరుపుకునే పూల పండగ ఈ బతుకమ్మ. నేడు సద్దుల బతుకమ్మ, నేటితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. తీరొక్క పూలతో 9 రోజులు బతుకమ్మలను పేర్చి.. పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ.. పల్లెల్లో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఆడ బిడ్డలంతా.. ఆట పాటలతో జానపద గేయాలతో హుషారెత్తించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ వేడుకలు ఎనిమిది రోజులు ముగిసి.. తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. చివరి రోజైన సద్దుల బతుకమ్మగా గౌరమ్మను కొలుస్తారు. సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేసిన అనంతరం.. పెరుగన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి, పులిహోర, ఇలా పలు రకాల నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.
అక్టోబర్ 2న ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు మొదలుకాగా.. అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. బతుకమ్మ పండగ మొదటి రోజు నుంచి 9 రోజులు బతుకమ్మను పేర్చి ఆటలు ఆడతారు. బతుకమ్మ పండగ సమయంలో 9 రోజులు రకరకాల నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మలను సాయంత్రం ఆడవాళ్ళు తలల మీద ఊరి మధ్యలో లేదా చెరువు సమీపంలో తీసుకువెళ్లి పెడతారు. వాటి చుట్టూ చేరి ఆటపాటలాడుతారు. చీకటి పడే వరకు అందరూ ఆనందంగా గడుపుతారు.అనంతరం,పోయి రావే బతుకమ్మ అంటూ, వెంట తీసుకువచ్చిన బతుకమ్మను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. తర్వాత,వెంట తెచ్చుకున్న నైవేద్యాలను ఒకరికొకరు పంచుకుంటారు.