Sabarimala: అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నం కావడంతో శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. గరిష్టంగా 80 వేల మందికి అయ్యప్ప దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానున్న వేళ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వర్చువల్ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల ముందే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు 10 రోజుల ముందు మాత్రమే బుకింగ్ సదుపాయం ఉండేది. ఇప్పుడు దాన్ని మూడు నెలల వరకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పెంచింది. శబరిమలకు వచ్చ భక్తుల రద్దీ దృష్ట్యా బుక్ చేసుకున్న వారికి దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై శబరిమల వచ్చే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని కేరళ సర్కారు తెలిపింది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.