Sabarimala: శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చు. శుక్రవారం ఈ మేరకు భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అనుమతి ఇచ్చింది. వచ్చే జనవరి 20 వరకు భక్తులు తమ క్యాబిన్ బ్యాగేజీల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చునని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం క్యాబిన్ బ్యాగేజీలలో కొబ్బరి కాయలను పట్టుకెళ్లేందుకు అవకాశం లేదన్న సంగతి తెలిసిందే. భక్తుల కోసం పరిమిత కాలంపాటు అనుమతి ఇచ్చినట్లు బీసీఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎక్స్-రే, ఎక్స్‌ప్లోసివ్ ట్రేస్ డిటెక్టర్, ఇతర తనిఖీలను చేసిన తర్వాత మాత్రమే కొబ్బరి కాయలను అనుమతిస్తారని తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులు తీసుకెళ్లే ఇరుముడి కెట్టులో నేతితో నింపిన కొబ్బరి కాయ, మరికొన్ని సాధారణ కొబ్బరి కాయలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.