Russia Decided To Remove Taliban From Terrorist Organization List: ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్‌లకు రష్యా నుంచి శుభవార్త వచ్చింది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్‌ను తొలగించాలని రష్యా నిర్ణయించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. అత్యున్నత స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌పై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కాబులోవ్ ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి వివిధ చట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది.
తాలిబాన్‌తో సంబంధాలు కొనసాగిస్తోన్న రష్యా
ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి రష్యా క్రమంగా తాలిబన్‌తో సంబంధాలను పెంచుకుంటోంది. ఉగ్రవాదంపై పోరులో ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ఉద్యమాన్ని రష్యా మిత్రదేశంగా పరిగణిస్తోందని పుతిన్ ఈ ఏడాది జులైలో చెప్పారు. అయినప్పటికీ, రష్యా ఇప్పటికీ అధికారికంగా తాలిబన్లను చట్టవిరుద్ధ సంస్థలుగా జాబితా చేస్తుంది.
తాలిబన్‌ను దేశానికి చట్టబద్ధమైన నాయకత్వంగా ఏ దేశమూ అధికారికంగా గుర్తించలేదు. అయితే, చైనా, యూఏఈ దాని రాయబారులను అంగీకరించాయి. మాస్కో 2003లో తాలిబన్‌ను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తొలగింపు ఒక ముఖ్యమైన అడుగు.
మాస్కోలో సమావేశం
ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి సమావేశం శుక్రవారం రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. ఇందులో రష్యా వైపు నుంచి విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ కూడా పాల్గొంది. భారతదేశం తరపున జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. జేపీ సింగ్ గతంలో ఆఫ్ఘనిస్థాన్‌లో పర్యటించి తాలిబన్ నేతలను కలిశారు.
ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి రష్యా విదేశాంగ మంత్రి విజ్ఞప్తి
శుక్రవారం (అక్టోబర్ 4) ఆఫ్ఘనిస్తాన్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని రష్యా పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రష్యా వార్తా సంస్థ స్పుత్నిక్ సమాచారం ఇచ్చింది. స్పుత్నిక్ ప్రకారం, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా యూఎస్ స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వాలని కోరారు. దీనితో పాటు, ఆఫ్ఘనిస్తాన్‌లో మూడవ దేశాల సైనిక మౌలిక సదుపాయాల విస్తరణను రష్యా వ్యతిరేకించింది.