Rhea Chakraborty: ఇటీవల కాలంలో కొందరు కేటుగాళ్లు అధిక లాభాల ఆశలు చూపించి ఆన్ లైన్ యాప్స్ ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని నమ్మబలికి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి యాప్స్ ప్రమోషన్ చేసినందుకు బాలీవుడ్ ప్రముఖ నటి రియా చక్రవర్తికి పోలీసులు సమన్లు జారీ చేశారు.
‘హైబాక్స్ మొబైల్ యాప్’ పేరతో రూ.500 కోట్ల భారీ స్కాం జరిగింది. యాప్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే యూట్యూబర్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ లాభాలు చెల్లించే క్రమంలో హైబాక్స్ యాప్ అధికారులు ఫెయిల్ అవ్వడంతో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకూ దాదాపుగా 500కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హైబాక్స్ సంస్థ అధికారులపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, కమెడియన్ భారతీ సింగ్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ వంటి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో హైబాక్స్ మొబైల్ యాప్ పై ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే మంచి కంపెనీయే అని భావించి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. చెన్నైకి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఈ యాప్ ను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను కూడా పోలీసులు విచారించారు. నటి రియా చక్రవర్తిని విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.