Raj Pakala: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. జన్వాడ కాలనీలో కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. పార్టీలో పాల్గొన్న వాళ్లకు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఒకరికి పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్టులో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్‌లో జరిగిన పార్టీపై డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేశారు. భారి శబ్దాలతో పార్టీ నడుస్తున్నట్లు డయల్ 100కు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు దాడులు చేపట్టి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్టులు నిర్వహించగా… ఓ వ్యక్తికి పాజిటివ్ రాగా.. మిగతా వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు భారీగా విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు పోలీసులు. రాజ్ పాకాలపై సెక్షన్34, ఎక్సైజ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. సుద్దపూస…. ఇప్పుడేమంటాడో… బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా అంటూ ఎద్దేవా చేశారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో అంటూ మండిపడ్డారు. ‘‘సుద్దపూస‘‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటన్నారు. చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలన్నారు. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందేనన్నారు. బడా నేతలతోసహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలన్నారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో సీసీ ఫుటేజ్‌ని బయట పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కొంతమంది పెద్దలను పోలీసులు పంపించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిజాలు వెళ్లడవుతాయన్నారు. ఈ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలన్నారు. అగ్రహారంలో ఎంతటి వాళ్లు ఉన్నా కఠినంగా శిక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.