PM Modi: 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 22-23 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సు 16వ సమావేశం రష్యాలోని కజాన్‌లో జరగనుంది. విశేషమేమిటంటే.. మూడు నెలల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జులైలో ప్రధాని మోడీ రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోడీ రష్యా పర్యటన సందర్భంగా కజాన్‌కు ఆహ్వానించబడిన బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన తన సహచరులు, నాయకులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ఈ పర్యటన ప్రాధాన్యత ఎంతో తెలుసా?
భారతదేశం- రష్యా మధ్య సంబంధాలు
భారతదేశం , రష్యా మధ్య సంబంధాలు గతంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి, అయినప్పటికీ రెండు దేశాల మధ్య స్నేహం గతంలో కంటే మెరుగ్గా, బలంగా ఉంది. ఆర్థిక రంగానికి సంబంధించి రష్యా దశాబ్దాలుగా భారతదేశానికి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. ఉక్రెయిన్‌తో సైనిక సంఘర్షణ తరువాత, భారతదేశం రష్యన్ చమురు అతిపెద్ద కొనుగోలుదారులలో ఒకటిగా నిలిచింది. రష్యా, భారతదేశం మధ్య వాణిజ్యం గత సంవత్సరం 66 శాతం పెరిగింది మరియు 2024 మొదటి త్రైమాసికంలో మరో 20 శాతం పెరగనుంది.
ప్రధాని రష్యా పర్యటనపై ఐరోపా దేశాల వైఖరిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందన
రష్యా, ఇండియాలు అంతర్జాతీయ రంగంలో, ప్రధానంగా ఐక్యరాజ్యసమితి వంటి ప్రపంచ సంస్థలలో, షాంఘై సహకార సంస్థ (SCO), బ్రిక్స్(BRICS) వంటి సంస్థలలో సన్నిహితంగా సహకరిస్తాయి. గత 75 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా తయారీ, ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక మార్పిడికి సంబంధించిన సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించనున్నాయి. దీంతో పాటు భౌగోళిక రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. భారతదేశం, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. ఇందులో ఇంధనం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం రంగాల్లో పరస్పర సహకరించుకుంటున్నాయి.
రష్యా అత్యున్నత పౌర గౌరవం
ఈ ఏడాది జూలైలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. రష్యాలో జరిగిన 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఇంధనం, వాణిజ్యం, తయారీ, ఎరువులు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై ఇరు దేశాలు చర్చించాయి. దీనితో పాటు, జాతీయ కరెన్సీలను ఉపయోగించి ద్వైపాక్షిక చెల్లింపు వ్యవస్థను కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. దీంతో పాటు రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులను వెనక్కి రప్పించాలన్న భారత్ డిమాండ్‌పై కూడా అంగీకారం కుదిరింది. ఇది కాకుండా, ఈ పర్యటనలో ప్రధాని మోడీని రష్యా అత్యున్నత పౌర గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’తో సత్కరించారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా, మాస్కోలోని ఒస్టాంకినో టెలివిజన్ టవర్ భారతదేశం, రష్యా జెండాల రంగులతో ప్రకాశించింది.