Paddy Cultivation: ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది తమ ప్రధాన ఆహారంగా బియ్యాన్ని వినియోగిస్తున్నారు. వివిధ రకాల వ్యవసాయ-వాతావరణ ప్రాంతాలలో పెరిగినప్పటికీ, ఆగ్నేయాసియాలో బియ్యం సాధారణంగా ఉపయోగించే ఆహారం. ఈ రోజుల్లో రసాయన ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తూ వరిని పండించడం వల్ల పర్యావరణ సమతుల్యత లోపిస్తుందే. అలా రసాయనాలను ఎక్కువగా వాడడం వల్ల సాగు పెట్టుబడి ఖర్చు ప్రతి ఏడాది పెరిగిపోతోంది. మీ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి వరి పంటలను ఎలా పండించాలనే దానిపై పూర్తి అవగాహన పొందండి.
వరి పంట శాస్త్రీయ నామం: ఒరైజా సటైవా
సాధారణ పేరు: రైస్ (ఇంగ్లీష్), ధాన్ (హిందీ), నెల్ (తమిళం), నెల్లు (మలయాళం), వరి (తెలుగు).
పంట కాలం: అన్ని సీజన్లు [ఖరీఫ్, రబీ, వేసవి]
వరి సాగు కోసం నేల అవసరాలు
వరి నాటడం ఇసుక నేల నుంచి బంకమట్టి నేలల వరకు అనేక రకాల నేలల్లో చేయవచ్చు. వరి పంటల సాగుకు ఉత్తమమైన నేల బంకమట్టి. వరి పంటలు అనేక రకాల నేల ప్రతిచర్యలను తట్టుకోగలిగినప్పటికీ, ఇది 5.5 నుంచి 6.5 మధ్య పీహెచ్ కలిగిన నేలల్లో బాగా పండుతుంది.
వరి సాగుకు వాతావరణ అవసరాలు
వరి నాటడానికి, సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడం చాలా ముఖ్యం. వెచ్చని, తేమతో కూడిన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో వరి బాగా సాగవుతుంది. వరి పంట 21˚C నుండి 38˚C ఉష్ణోగ్రత పరిధిలో మెరుగ్గా పని చేస్తుంది. ఇది 40 ̊C వరకు కూడా తట్టుకోగలదు.
వరి పంట సాగు ఇలా..
వరి పంట వేసే ముందు వేసవిలో భూమిని లోతుగా దుక్కిని దున్ని ఎండబెట్టుకోవాలి. వరి పంట వేసే ముందు జనుము, జీలుగా, పెసర లేదా పిల్లి పెసర లాంటి పచ్చిరోట్ట పైర్లను వేసి పూత దశలో బురదలో కలియ దున్ని బురదలో మగ్గనివ్వాలి. గతంలో వేసిన పంట అవశేషాలు పూర్తిగా తొలగించాలి. ఆయా ప్రాంతాలను వాతావరణ పరిస్థితులను బట్టి చీడ పిడలను, తెగుళ్లను తట్టుకునే వరి రకాలను ఎంచుకోవాలి. నారుమడి సిద్ధం చేసుకునే ముందు వరి విత్తనాలను శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. పొలం గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి. భూమి స్వభావమును బట్టి ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి. వరి పంట అధిక దిగుబడి కోసం తెగులు, పురుగు వ్యాప్తిని మొదటి దశలోనే గుర్తించి నివారణ చర్యలు చెప్పటాలి. సరైన పద్దతిలో నీరు పొలం మడిలో నిలువ ఉండేలా నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి. సరైన పక్వదశలోకి రాగానే పంట కోతను చేపట్టాలి. గింజలో తేమ శాతం తక్కువ ఉండేలా ఎండలో ఆరబెట్టి, తేమ శాతం తక్కువ అయ్యాక ధాన్యాన్ని నిల్వ చేయాలి. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోనె సంచులను మాత్రమే వినియోగించాలి.
నారుమడి ఇలా సిద్ధం చేసుకోండి..
మీరు ఎకరం పొలంలో నాటు వేసుకోవాలంటే ముందుగా నారుమడిలో నారును సిద్ధం చేసుకోవాలి. ఎకరానికి 2 గుంటలు లేదా 5 సెంట్ల స్థలాన్ని నారుమడి కోసం సిద్ధం చేసుకోవాలి. 20 నుంచి 24 కిలోల విత్తనాలను నారుమడిలో విత్తుకోవాలి. విత్తనం వేసే సమయంలో నారుమడిలో యూరియా 2.5కిలోలు+సింగిల్ సూపర్ పాస్పేట్ 6.5 కిలోలు+మ్యురేట్ ఆఫ్ పొటాష్ 1.75 కిలోలు సిద్ధం చేసుకున్న నారుమడిలో వేసుకోవాలి. చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో మాత్రం సింగిల్ సూపర్ పాస్పేట్ రెట్టింపు మోతాదులో వేయాలి. 2.5 కిలోల యూరియా విత్తిన 12-14 రోజులలోపు వేయాలి. నారుమడిలో ఊద నిర్మూలనకు బ్యూటాక్లోర్ 50 ఎంఎల్ తీసుకుని 10 లీటర్ల నీటికి కలుపుకుని విత్తిన 7 నుంచి 9 రోజుల్లో లేదా సైహలోపాస్-పి-బుటైల్ 20 ఎంఎల్ తీసుకుని 10 లీటర్లనీటిలో కలుపుకుని విత్తిన 14-16 రోజుల్లో నారుమడిలో నీటిని తీసివేసి పిచికారి చేయాలి. రబీలో చలి వల్ల జింక్ లోప లక్షణాల సవరణకు జింక్ సల్ఫేట్ 20గ్రా/10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
నాటు కోసం పొలాన్ని సిద్ధం చేసుకోండి..
నారుమడిలో పెంచిన వరి నారు వయస్సు 25 నుంచి 30 రోజులు మించకుండా చూసుకోవాలి.ఈ మధ్య కాలంలో పొలంలో నాటు వేస్తే ఎదుగుదల బాగుంటుంది. ఒకవేళ నాటు వేయడం ఆలస్యమైతే నారు కొనలను తుంచి నాటు వేయాలి. 30 రోజులకు మించితే దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. వివిధ తెగుళ్ల నివారణకు ముందు పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. నాటు వేసే ముందు రెండు నుంచి మూడు సార్లు వారం రోజుల వ్యవధిలో పొలాన్ని దమ్ము చేసుకుంటే మంచిది. ఇలా చేస్తే కలుపు మొక్కలను పూర్తిగా నాశనం చేయవచ్చు. బురద పొలం చివరి దమ్ములో ఎకరానికి ఒక్క బస్తా డీఏపీ (50 కిలోలు) + యూరియా 10 కిలోలు + మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10 కిలోలు చేసి నాటు వేయడం చేపట్టాలి. నత్రజని ఎరువును యూరియా రూపంలో పైరు ఎదుగుదలను బట్టి 2 నుంచి 3 సార్లు పదునులో వేయాలి. పైరు ఎదిగిన 50-60 రోజుల మధ్య వయస్సులో 50 కిలోల యూరియాలో మ్యురేట్ ఆఫ్ పొటాష్ 15 కలుపుకుని తప్పనిసరి వేయాలి. పంటను ఆశించిన తెగుళ్ల నివారణకు వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన పురుగు మందులను మాత్రమే వినియోగించాలి.
వరిలో తెగుళ్లు.. నివారణ చర్యలు
అగ్గితెగులు :
వరి తొలిదశలో ఆకులపైన నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఇది విస్తరించి మచ్చలు చివర్లు మొనదేలి ఉంటాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండి ఆకులు కాలిపోయినట్లుగా వ్యాపించి నష్టపరుస్తుంది. వరి దుబ్బుల్లో, వరి గడ్డిపైన, కలుపు మొక్కల్లో స్థావరం ఏర్పరచుకొని అనుకూల పరిస్థితుల్లో వరి పైరుపై ఆశిస్తుంది. నత్రజని ఎరువుల అధిక మోతాదుల్లో వాడటం, గాలిలో తేమ అధికంగా ఉండడం, మబ్బుతో కూడిన వాతావరణం, సన్నని వర్షపు జల్లులు, ఉష్ణోగ్రత 25–30 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తిస్తుంది.
నివారణ చర్యలు: విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పైరుపై తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే పొలంలో నీటిని తీసివేయాలి. బాగా ఆరనివ్వాలి. దీని వలన శిలీంద్రం తాలూకు సిద్ధ బీజాలు నశిస్తాయి. ట్రైసైక్లేజోల్ 1.5గ్రాములు లేదా కాసుగామైసీన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆశించే పురుగులు.. నివారణ చర్యలు
కాండం తొలుచు పురుగు: ఈ పురుగు నారుమడి, పిలకదశ, అంకురం నుంచి చిరు పొట్టదశ వరకు ఆశిస్తుంది. పిలక దశలో మొవ్వు చనిపోతుంది. అంకురం నుంచి చిరు పొట్టదశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి. కంకి పాలు పోసుకోక తాలు పోతుంది. ఈ పురుగు ఆలస్యంగా నాట్లు పెట్టినా లేదా ముదురు నాట్లు పెట్టినా ఆశిస్తాయి. నత్రజని ఎరువులు తక్కువగా వాడడం వలన కాండం బలహీనంగా మారినప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది.
నివారణ చర్యలు: నాట్లు ఆలస్యమైనప్పుడు నారు కొనలు తుంచి వేయాలి. ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలు పెట్టి ప్రతి వారం బుట్టలో పడే మగరెక్కల పురుగులను గమనించి నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిల్ప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
సుడిదోమ (దోమపోటు): ఈ పురుగు నారు మడి లేదా పిలకల దశలో అరుదుగా, పొట్టదశ, ఈనిక దశల్లో ఎక్కువగా ఆశిస్తుంది. నీటి పైభాగంలో మొక్కల మొదళ్ల దగ్గర దోమలు కనబడతాయి. పిల్ల, పెద్ద పురుగులు రసాన్ని పీల్చటం వల్ల పైరు సుడులుగా ఎండిపోతుంది. ఉధృతి ఎక్కువగా ఉంటే పొలం ఎండిపోయి పడిపోవడం, తాలుగింజలు లేదా నూర్చినప్పుడు నూకపోవడం జరుగుతుంది.
నివారణ చర్యలు: దోమను తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలి. నత్రజని అధిక మోతాదు తగ్గించుకోవాలి. కాలిబాటలు తీయాలి. ఎసిఫేట్ 1.5 గ్రాములు, లేదా ఎథోఫెన్ప్రాక్స్ 2.0 మి.లీ, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లికోడు లేదా గొట్టపు రోగం : ఇది నారుమడి, పిలక దశలో ఆశిస్తుంది. అంకురం ఉల్లికాడ లాగా పొడగాటి గొట్టంలా మారి బయటకు వస్తుంది. కంకి వేయదు. దుబ్బుల్లో కొన్ని పిలకలు ఉల్లికాడవలె పొడగాటి గొట్టాలుగా మారతాయి. సెప్టెంబరులో 200 మి.మీ. కంటే ఎక్కువ వర్షం పడితే ఇది వ్యాపిస్తుంది.
నివారణ చర్యలు: దీనిని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. ఆలస్యంగా నాట్లు వేసినప్పుడు కార్బోప్యూరాన్ 3జి గుళికలను 10కిలోలు లేదా ఫోరెట్ 10జి గుళికలను 5 కిలోలు ఎకరానికి నాటిన 10నుంచి 15 రోజులకు వేసుకోవాలి.
పాముపొడ తెగులు: దుబ్బు చేసు దశ నుంచి కాండం, మట్ట, ఆకులపై మచ్చలు పెద్దవై పాము పొడ మచ్చలుగా ఏర్పడతాయి. మొక్కలు, పైరు పూర్తిగా ఎండిపోతుంది. తెగులు వెన్ను వరకు వ్యాపిస్తే తాలుగింజలు ఏర్పడతాయి.
నివారణ చర్యలు: విత్తన శుద్ధి చేయాలి. సిఫారసు మేరకు నత్రజని ఉపయోగించాలి. గట్లపై, చేనులో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. హెక్సాకొనాజోల్ 2. మి.లీ. లేదా ప్రాపికొనాజోల్ 1 .మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.