Gummadavelly: పీర్ల పండుగ.. కుల మతాలకు సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే పండుగ. అందరూ మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు.పది రోజులపాటు జరుపుకునే ఈ పండుగకు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ తర్వాత పీర్ల పండుగకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం పద్నాలుగో శతాబ్దం క్రితమే జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహరం. దైవప్రవక్త మహమ్మదు మనమళ్లు హసన్, హుసేన్‌ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు. నిప్పుల గుండం తొక్కుతారు. పీరుల్ని పీర్లచావడిలో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. “ఊదు వేయందే పీరు లేవదు”. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరుసాయిబు అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి.
నా స్వగ్రామమైన సూర్యాపేట జిల్లాలోని గుమ్మడవెళ్లి గ్రామంలో పీర్ల పండుగను కుల మతాల ప్రసక్తి ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఎంత గొప్పగా అంటే.. మాటల్లో వర్ణించలేనంతగా. మా గ్రామంలోని పీర్ల పండుగ విశేషాలు ప్రముఖ కాలమిస్ట్ కోట దామోదర్ మాటల్లో.. “చాలా సంవత్సరాల తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు హైద్రాబాదులోని ECIL బస్టాండ్లో కలిశాడు. కాసేపు ఇద్దరం బస్టాండ్లో కూర్చొని ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఉండగా మిత్రుడు చిన్నప్పుడు ఊళ్ళో జరిగిన పీర్ల పండుగ గుర్తుచేస్తూ కడుపుబ్బా నవ్వించిండు. గుమ్మడవెల్లి వారందరికీ ఈ సంఘటన తెలిసే ఉంటుంది కానీ మరోసారి తెలుసుకొని నవ్వడంలో మాత్రం తప్పులేదు.
ఆరోజు శనివారం చీకటిపడేయేలా కచ్చిరు దగ్గర సరిగస్తు ఉంది అందరూ రారండయ్యో అని ఊరంతా డప్పుసాటింపు జేసిండ్రు. సరిగస్తుందని విన్నాక మాలాంటి పోరగాళ్లకు ఎక్కడాలేని ఆనందం, ఉత్సాహం ఉప్పొంగింది. ఎక్కడేమోగాని మా ఊళ్ళో సరిగస్తు గమ్మత్తుగా ఉంటది, తీరొక్క వేషాలు వేసి పీర్లకొట్టం గుండం దగ్గర డప్పుదరువులకు అందరూ ఎగిరెగిరి నృత్యం చేసేటోళ్ళం. సరిగస్తు ఉందంటే ఆరోజు ఊళ్ళో అందరూ నడిరేత్రివరకు నిద్రపోకుండా సరిగస్తు ఆట చూసేందుకు పీర్లకొట్టంకాడనే కూసునేది. సరిగస్తుందని డప్పుసాటింపు చేసినాక ఊళ్ళో కొందరు ఇయ్యాల ఏం వేషం వేయాలని గుసగుసలాడుకుండ్రు. మరికొందరైతే గుండంలో మంటకాలాడానికి కట్టెలు మొద్దులు, తడకలు ఏడనుండితేవాలన్న ఆలోచనపడ్డారు. కొద్దిసేపైనకా గుండందగ్గర అందరూ పోగయిండ్రు సరిగస్తు మొదలైంది . ఒక్కొక్కరు గుర్తుపట్టని వేషాలు యేసుకొని గుండంసుట్టు ఎగురుతుంటే అందరూ గీయన ఎవరో ఉండే తోట బక్కయ్య కదూ? అని కొందరు కాదు కాదు ఆయన ఎందుకైయే తోట బక్కయ్య కాదు హే ఎవరో అని మరికొందరు అట్లా గుర్తుపట్టరాకుండా వేషాలేసుకొని వచ్చిండ్రు. గుండం చుట్టూ గమ్మత్తయిన స్టెపులేసుకుంటూ నృత్యం చేస్తుంటే కాళ్ళాడనోళ్ళకుకూడా లేసి ఓ స్టెప్పేయాలనిపించేది గట్లుండే పీర్ల పండగ సంబురం. వేషం వేసుకొని గుర్తుపట్టనివారి మొహాలు తెల్లారిగట్ల వాళ్లమొహానికి రంగులు పూసుకున్నట్లు మొహమ్మీద అక్కడక్కడా కలర్ ఉండేది గప్పుడు గాని తెలిశేది రాత్రి ఏదో వేషం వేశాడని. ఆరోజు తోట బక్కయ్య ఒంటినిండా గడ్డికప్పుకొని వేషం వేయడంవల్ల ఆయన్ని ఎవరు గుర్తుపట్టలేదు ఒక్కొకరిదగ్గరకు వచ్చి ఆయన వేసే స్టెప్పులకు నవ్వు ఆగకపొయ్యేది.
దూదేకుల లతీఫ్ నోట్లో నూకలు నములుకుంటూ వింతైన వేషంతో గుండం సుట్ఠు నృత్యం చేస్తుంటే ఆ గమ్మతే వేరు. పీర్ల పండుగ వచ్చిందంటే లతీఫ్ తాత తీరొక్కతీరు వేషాలేసేది. లతీఫ్ తాత లేకపోతే పీర్ల పండుగ లేదు అన్నట్లుగా పీర్ల పండుగ పెద్దమనిషి దూదేకుల లతీఫ్. ఇంకో గమ్మత్తయిన వేషం ఏంటంటే చినిగిపోయిన గుడ్డపేలుకలతో నడుంచుట్టూ కట్టుకొని పాత చీపురుకట్ట చేత పట్టుకొని గుండం సుట్ఠు రెండురౌండ్లు తిరిగి అక్కడ కనపడ్డవాళ్ళని మెడలోంచి వీపున చీపురుకట్టతో రెండు అంటించిండు కుమ్మరి మల్లయ్య. ఎక్కడ దెబ్బలుపడుతాయో అని కొంతమంది ఉరికిండ్రు కొంతమంది పాత చీపురుకట్టతో కొట్టించుకుంటే దెయ్యాలు బూతులు దరిచేరవని నమ్మి మరి మరి కోటించుతుండ్రు కుమ్మరి రామయ్య వేషం ఎప్పటికి మరచిపోలేము. అట్లా చాలామంది వేషాలేసుకొని ఎగురుతుంటే అనుకోకుండా ఒక గమ్మత్తయిన ముసలాయన వేషంతో వచ్చి గుండం కాడ సుట్టా కలుస్తూ అందరిని ఆశ్చర్యపరిచిండు. అందరూ ఆశ్చర్యపోయి గుండంకాడ సుట్ట కలుస్తుండు అంతదైర్యం ఎవ్వడికుందని ఎవరీ ముసలాయనని అందరూ గుసగుస కానీ అక్కడ ఎవ్వరు గుర్హ్తుపట్టలేకుండా వేషం వేసుకుండు గంభీరమైన నల్లని మీసాలతో నడుమువంగినట్లు చేతికర్ర పట్టుకొని గుండం చుట్టూ తిరిగి ఇంటికి పోయిండు. అక్కడ ఎవరో వేషం వేసుకుంటుంటే చూసినాయన హే ఆయన కోట సోమయ్య అని చెప్పిండు అప్పుడుగాని గుర్తుకురాలే ఆయన కోట సోమయ్య (మా నాన్న) అని. అలా ఎంతోమంది పోతరాజు వెంకన్న, ఇంకా చాలామంది వింతైన వేషాలతో అందరిని ఆశ్చర్యపరుస్తూ సరిగస్తు చేసిండ్రు. ఆరోజు గుండంలో మంట పెట్టడానికి మొద్దులు, తుంటలూ ఇంటిముందుండే తడికలు ఎదురుకొచ్చి అన్ని గుండంలో పడేసిండ్రు. సరిగస్తు సంబరంలో అక్కడఉన్నోళ్లకు ఇంటికాడ తడికలు మాయమవుతాయేమో అనే భయము ఉండేది. సరిగస్తు అయినాక ఇంటికిపోయినంక తెలిసేది ఇంటిముందు తడిక మాయమైందని. ఆరోజు చాలా తడికలు ఊళ్ళో ఎదుర్కొచ్చి గుండంలో పడేసిండ్రు సరిగస్తు సంబరమున జనాలుంటే తడికలు, మొద్దులు ఊళ్ళో ఎదుర్కొచ్చే పనిలోకొందరున్నారు. తెల్లారి ఆదివారం కాబట్టి ఆరోజు చాలా పెద్దగా జరిగింది అందరూ మస్తు ఎంజాయ్ చేసిండ్రు. సరిగస్తు అయిపోయినాక అందరూ ఎవరి ఇండ్లల్లకు వాళ్ళు పోయిండ్రు.
తెల్లారి ఆదివారం పొద్దుగాల బడికాడ గొల్లోల్ల ముసలమ్మా నోటికొచ్చినట్టు ఒకటే తిడుతుంది తడికలెత్తుకుపోయినోడి కడుపుడుకా, వాడి బొందమీద మన్నుబొయ్యా, వానిల్లు నాశనంగాను అని ఒకటే తిట్టుడు. సరిగస్తు సంబురాన తడికలు ఎత్తుకబోయినోళ్లు గొల్లోల్ల ముసలమ్మా తిట్లు విని ఒకనవ్వుకునుడు కాదు ఓవైపు పాపం అనుడు ఒకవైపు నవ్వుడు. ఎంతైనా సరిగస్తు గమత్తే వేరబ్బా.
పీర్ల పండుగ అయిపోయిన మరునాడు అతిభయంకరమైన బేతాళుడి వేషం వేసేది ఇతరాజు బుచ్చయ్య. నాకుతెలిసి బుచ్చయ్య వేషం చూసి బయపడనివారుండరనేది ముమ్మాటికీ నిజం. అసలైన బేతాళుడు కూడా బుచ్చయ్య వేషం చూసి బయపడుతాడేమో బహుశా. నల్లని శరీరం పొట్టిగా భారీ బొర్ర తో నోట్లో కత్తిపొడుసుకొని ఒంటినిండా రక్తంతో వేపమండలు చేతబట్టుకొని, వెనకాల పగ్గాలతో కట్టి ముగ్గురునాలుగురు అదిమి పట్టుకునేది అయినా ఆయన ఉరికేటప్పుడు వెంట ఉన్నోళ్లు ఆయన్ని ఆపలేక శానా ఇబ్బంది పడేటోళ్లు. బదార్ల నిలబడ్డోడిని వేపమండలతో ఉరికిచ్చుకుంటూ కొట్టేది. బుచ్చయ్య భేతాళుడి వేషం వస్తున్నదంటే చిన్న పోరగాళ్ళు తలుపులసంధులనుండి చూసేది తప్ప బయటకు రాకపోతుండే. ఆయన్ని చూస్తే చిన్నపిల్లలు అదురుకే బెదురుతరు. బేతాళుడి వేషం వేయడంలో ఇతరాజు బుచ్చయ్య ను మించినోడు లేడు ఇక రాడు కూడా వేషానికి తగ్గట్టుగా నటన, నడక, ఆ నృత్యం అందరికి రాదనే చెప్పాలి.
పీర్ల పండుగ ప్రత్యేకత ఏంటో ఏమి తెలియదుగాని సరిగస్తు ఆట, బేతాళుడి వేషం వేస్తారని మస్తు గమ్మత్తుగా ఉంటుందనిమాత్రమే తెలుసు.. సరిగస్తు ఆట నాడు ఇంటిముందున్న తడికలు భద్రంగా దాసుకుంటారనేది తెలుసు. ఈరోజుల్లో చేసే పీర్ల పండుగ అసలైన పీర్ల పండుగ అన్నట్లుగా లేదు. ఆరోజుల్లో ఉన్న సరిగస్తు గమ్మత్తు వేరు.”
కోట దామోదర్
మొబైల్ : 9391480475