Home » Minister Ponguleti: డిసెంబర్‌ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Minister Ponguleti: డిసెంబర్‌ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Minister Ponguleti Srinivas Reddy: రాష్ట్రంలో మరో ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఈ డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంక్రాంతి నాటికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని అన్నారు. మరో వైపు సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల ఒక నెల గడువు ఉందని.. అప్పటివరకు కూడా మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే కొనసాగుతారన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలనే ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను తీసుకుందని వెల్లడించారు. ఈనెల నవంబర్ 6, 7 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిధుల కోసం ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. మొదట పేదవారికి ప్రాధాన్యత… ఇండ్ల స్థలం ఉండి ఉన్న వారికి 5 లక్షల నిర్మాణ ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఇండ్ల స్థలాలు లేని నిరు పేదలకు 75 నుంచి 80 గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేస్తోందన్నారు. 4000 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇండ్ల నిర్మాణం చేయాల్సిందేనన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తుందని చెప్పారు. 360 డిగ్రీల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పని సరి అని వెల్లడించారు. త్వరలో రేషన్ కార్డుల స్థానాల్లో స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు.

నాలుగు దఫాలుగా ఇండ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వంలోని 16 శాఖలకు సంబంధించిన ఉద్యోగులను ఇందిరమ్మ ఇండ్ల మానిటరింగ్‌కు కేటాయిస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. వాళ్ళు పెట్టే అన్ని షరతులకు మేము ఒప్పుకుంటామన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లను కూడా మేమే పూర్తి చేస్తామని వెల్లడించారు. మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకు వెళ్ళేది ఇందిరమ్మ ఇండ్ల పథకమేనంటూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *