Matka Movie Review:
మట్కా మూవీ రేటింగ్- 2.75/5
నిడివి-2 గంటల 30 నిమిషాలు | యాక్షన్ డ్రామా
విడుదల తేదీ- 14-11-2024
తారాగణం – వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, కిషోర్, అజయ్ ఘోష్, నవీన్ చంద్ర మరియు ఇతరులు
దర్శకుడు – కరుణ కుమార్
నిర్మాత – విజయేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి
బ్యానర్ – వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
వైవిధ్య సినిమాలు ఎంచుకుంటూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తున్న హీరో వరుణ్ తేజ్ నేడు ‘మట్కా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మళ్లీ తన ఖాతాలో హిట్ పడలేదు. ఆ సినిమా తర్వాత గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి.
‘పలాస 1978’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి మట్కా గ్యాంబ్లర్ రతన్ ఖేత్రీ జీవితం ఆధారంగా రూపొందించిన ఒక పీరియాడికల్ డ్రామా కోసం చేతులు కలిపాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ 1958, 1982 మధ్య జరిగిన కథ నుండి చాలా పాతకాలపు లుక్స్‌లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కూడా ఉన్నారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.. మరి సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ వివరణాత్మక విశ్లేషణ ఉంది.
కథ ఏంటి?
శరణార్థి వాసు (వరుణ్ తేజ్) , అతని తల్లి 1958లో బర్మా నుంచి బతుకుదెరువు కోసం విశాఖపట్నం వచ్చారు. వాసు ఒక హత్య కేసులో జైలుకు వెళ్లి ఫైటర్‌గా మారతాడు. వాసు సాహసోపేత స్వభావం, ధనవంతుడు కావాలనే కోరిక అతన్ని శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా చేస్తాయి. మట్కా అంటే ఏంటి ..వాసు నాట్కా కింగ్ ఎలా అవుతాడు, ఆ తర్వాత అతనికి ఏం జరుగుతుంది.. సుజాత ఎవరు.. ఆమెతో వాసు ప్రేమాయణం ఎలా జరిగింది.. అనేది అంతా మట్కా.
మట్కా పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చే పేరు రతన్ కత్రీ. పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చిన రతన్ కత్రీ మట్కా కింగ్ ఎదిగి.. మట్కాను లీగల్ చేస్తే.. ఇండియాకు ఉన్న అప్పులను తీర్చేస్తానని కేంద్రానికి ఆఫర్ ఇచ్చిన గ్యాంగ్ స్టర్. అయితే ఆ పాయింట్ ను కథగా మలిచి.. విశాఖ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు దర్శకుడు కరుణకుమార్.
వరుణ్ ప్రాణం పెట్టేశాడు..
యాక్టర్ గా వరుణ్ తేజ్ ను ఓ మెట్టు ఎక్కించింది ఈ మట్కా. ఈ సినిమాలో వరుణ్ తేజ్ చూపించిన వేరియేషన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వరుణ్ తేజ్ ఫిజిక్ ను డైరెక్టర్ కరుణకుమార్ పూర్తిగా వాడేసుకున్నాడు. వరుణ్ తేజ్ ఫర్ఫామెన్స్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవాల్సిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అందాల భామ మీనాక్షి చౌదరికి మట్కా చిత్రంలో మంచి పాత్ర దక్కింది. నోరా ఫతేహి తన గ్లామర్ తో మ్యాజిక్ చేసింది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, రవి శంకర్ తమ పాత్రలను పోషించి మెప్పించారు.
సాంకేతిక అంశాలు
దర్శకుడు కరుణ కుమార్.. మట్కా స్టోరీ గురించి టేకింగ్ వరకూ అన్నింట్లోనూ తన మార్కును చూపించాడు. తాను అనుకున్న కథను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలోనూ సక్సెస్ అయ్యాడు. ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలు తీసిన కరుణ కుమార్, మాస్ ఎలిమెంట్స్‌తో ‘మట్కా’ తీసి, తాను కమర్షియల్ సినిమా కూడా తీయగలనని తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ‘మట్కా’ మూవీకి మరో ప్లస్ పాయింట్ జీవీ ప్రకాశ్ మ్యూజిక్.
చివరకు ఏంటంటే.. మట్కా అనుకున్న అంచనాలను మాత్రం అందుకోలేదనేది వాస్తవం. ఇలాంటి గ్యాంగ్ స్టర్ కథలు ఇంతకు ముందు చూశాం. మట్కా కూడా గ్యాంగ్ స్టర్ ఒక రేంజ్ కు ఎదిగినట్లు చూపించిన సినిమానే. ఇందులో వరుణ్ ఫర్ఫామెన్స్ అదిరిపోయింది. ఆయన యాక్టింగ్ కోసం సినిమాను చూడొచ్చు.