Pakistan: జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన భార్య, కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, పార్టీ నేతలను అక్టోబర్ 18 వరకు కలవకుండా పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుండగా.. త్వరలో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలు వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పీటీఐ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాప్ (పీటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అనేక కేసులలో ఆగస్టు 2023 నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.
అక్టోబరు 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించడానికి పీటీఐ ప్రయత్నిస్తోందని అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఆరోపించారు. ఈ ప్రణాళికలు విజయవంతం కాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. “రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అతని భార్య బుష్రా బీబీని, కుటుంబ సభ్యులను, న్యాయవాదులను, పార్టీ నాయకులను అక్టోబర్ 18 వరకు కలవకుండా నిషేధించబడ్డారు” అని పంజాబ్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న SCO సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పీఎంఎల్-ఎన్‌కి చెందిన షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శిఖరాగ్ర సమావేశాన్ని అడ్డుకునేందుకు ఇస్లామాబాద్‌లో పీటీఐ నిరసనలు నిర్వహిస్తోందని ఆరోపించింది. SCO శిఖరాగ్ర సమావేశానికి భద్రత కల్పించేందుకు పాకిస్థాన్ సైన్యాన్ని పిలిచారు. గతంలో, పీటీఐ వ్యవస్థాపకుడికి సహాయం చేశారనే ఆరోపణలపై అడియాలా జైలులోని ఆరుగురు ఉద్యోగులను భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి.ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలతో సమావేశాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఖాన్ న్యాయవాద బృందం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పీటీఐ ప్రతినిధి తెలిపారు. ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సర్దార్ ఇజాజ్ కొంతకాలం క్రితం ఇమ్రాన్ ఖాన్‌ను ఎదుర్కోవాల్సిన కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, భౌతికంగా సాధ్యం కాకపోతే వీడియో లింక్ ద్వారా ఆయనను హాజరుపరచాలని అధికారులను ఆదేశించారు. పీటీఐ మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు.