HYDRA: నగరంలో చెరువులను, కాలువలను, ఫుట్‌పాత్‌లను, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వందరోజులు పూర్తయ్యాయి. ప్రభుత్వ లక్ష్యం మేరకు ముందుకు సాగుతూ.. చెరువులకు పునరుజ్జీవనం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్రయత్నంలో మీడియా అందిస్తున్న సహకారానికి హైడ్రా కృతజ్ఞతలు తెలిపింది. కొన్ని మీడియా సంస్థలు, మరికొంత మంది సోషల్ మీడియాలో పనికట్టుకుని హైడ్రాపై తప్పుడు ప్రచారం చేసి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని హైడ్రా కమిషనర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో హైడ్రా చర్యలపై క్లారిటీ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు..
ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదని ఆయన స్పష్టంగా తెలియజేశారు. సర్వే నంబర్లు మార్చేసి.. తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది.. భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైడ్రా కూల్చిన తర్వాత ఆ వ్యర్థాలను సదరు బిల్డరే తొలగించాలన్నారు. లేని పక్షంలో వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. కొంతమంది నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తుండగా.. మరి కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. మరి కొంతమంది అక్కడ ఉన్న విలువైన ఇనుప చువ్వలు, ఇతర సామగ్రిని తీసుకుని వ్యర్థాలను వదిలేస్తున్నారని తెలిపారు. అక్కడ పూర్వ స్థితికి భూమిని తీసుకురావాల్సిన బాధ్యత బిల్డర్లపైనే ఉందన్నారు. విలువైన వస్తువులు తీసుకెళ్లి మిగతా వ్యర్థాలను అక్కడే వదిలేయడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. చెరువులకు పునరుజ్జీవనం కల్పించే క్రమంలో హైడ్రానే చొరవచూపి.. అక్కడ నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తోందన్నారు. ఇందుకు అయ్యే ఖర్చును నిర్మాణదారుడి నుంచి వసూలు చేస్తుందన్నారు. నిర్మాణ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను కూడా టెండర్ల ద్వారా పిలిచి అప్పగించడమౌతోందన్నారు. ఇంకా మిగిలిపోయిన ఇనుప చువ్వలను వేరుచేసి.. వ్యర్థాలను తొలగిస్తున్నారని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కొన్ని మీడియా సంస్థలు హైడ్రా చర్యల పట్ల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా.. ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఉదాహరణకు నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ఎర్రకుంట చెరువులో సర్వే నంబర్లు వేరేవి చూపించి.. తప్పుడు సమాచారంతో ఎర్రకుంట చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలోని సర్వే నంబర్లు 48, 49లో నిర్మించిన 5 అంతస్తుల 3 భవనాలను ఆగస్టు 14వ తేదీన హైడ్రా కూల్చిన విషయం విధితమే.. ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో 5 అంతస్తుల 3 భవనాలను నిర్మించిన సుధాకర్‌రెడ్డి పై ఇరిగేషన్ విభాగం అధికారులు బాచుపల్లి పోలీసు స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఎర్రకుంట చెరువులో నిర్మించిన భవనాల వ్యర్థాలను తొలగించాలని సదరు నిర్మాణదారుడు సుధాకర్ రెడ్డికి నోటీసులు కూడా హైడ్రా జారీ చేసింది. అయితే విలువైన వస్తువులను తీసుకెళ్లి.. భవన వ్యర్థాలను అక్కడే సదరు నిర్మాణదారుడు వదిలేశారు.
ఎర్రకుంట చెరువుకు పునరుజ్జీవనం ఇచ్చే క్రమంలో.. అక్కడ వదిలేసిన వ్యర్థాలను తొలగించే పనికి హైడ్రా టెండర్లు పిలిచిందన్నారు. పిల్లర్ల మధ్యన ఉన్న ఇనుప చువ్వలను తొలగించి.. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును మినహాయించి.. డెబ్రీస్‌ను ఎత్తడానికి ఎంత అయ్యిందో అంత చెల్లించాలని హైడ్రా నిర్ణయించిందన్నారు. ఇదే మొత్తాన్ని భవన నిర్మాణదారుడిని నుంచి వసూలు చేస్తుందని తెలిపారు. నగరంలో ట్రాఫిక్, వరద నీటి సమస్య పరిష్కారానికి హైడ్రా కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటోందన్నారు.