Hyderabad Crime: రాష్ట్రంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరంలో వరుస నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఆటో ఎక్కి మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే ఆటోడ్రైవర్ దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు కలిసి ఆమెపై ఆటోలోనే అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన అనంతరం యువతిని అక్కడ వదిలేసి వారు పారిపోయారు. ఈ మేరకు బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లో ఓవైపు అఘాయిత్యాలు.. మరోవైపు మర్డర్లు వరుసగా వెలుగు చూస్తున్న వేళ.. మరో ఘటన ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని, నేరాల రేటు గణనీయంగా పెరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదన్నారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు సమీక్ష చేయడం లేదని వ్యాఖ్యానించారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమన్నారు. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.