Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని వాహనదారులకు అలర్ట్. నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచే నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే చలానా ధర 200కి పెంచారు. రాంగ్ సైడ్, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. రాంగ్ రూట్‌లో వచ్చిన వారికి చలానా ధరను రూ.2వేలకు పెంచారు.
నేటి నుంచే హెల్మెట్ మస్ట్ నిబంధన అమల్లోకి తెచ్చామని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. బైక్ నడిపే వాళ్ళలో నూటికి నూరు శాతం మంది హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి నిబంధనలు అమలు చేస్తామన్నారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపితే 2 వేల రూపాయలు ఫైన్ విధిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న టూ వీలర్స్‌లో ఎక్కువమంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నారని వెల్లడించారు. ప్రమాదాలను నివారించేందుకే నిబంధనలు కఠినతరం చేశామన్నారు.