Haryana Election Results 2024: హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన జరిగిన ఒకే విడత ఎన్నికల్లో 65.65 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలైన ఓట్లను ఈరోజు (8న) లెక్కించి ఫలితాలు ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల అనంతరం సర్వేలు చెప్పాయి.
కానీ ఈ రోజు ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ తారుమారయ్యాయి. 90 నియోజకవర్గాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 నియోజకవర్గాలు అవసరం. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకారం హర్యానాలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ 48 నియోజకవర్గాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 37 నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
అదే విధంగా రాష్ట్ర పార్టీ లోక్ దళ్ 2 స్థానాల్లో, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 46 స్థానాల కంటే ఎక్కువ అంటే 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. హర్యానాలో సంపూర్ణ మెజారిటీతో పాలనను ఏర్పాటు చేసింది.
అలాగే 37 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా హర్యానా అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. బీజేపీ హర్యానాలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హర్యానాలో బీజేపీ చరిత్ర సృష్టించింది.
వరుసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి పార్టీగా ఘనత సాధించింది. బీజేపీకి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలను ఎదుర్కొని ఇప్పుడు విజయం సాధించారు. ఫలితంగా హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ, ఆయన మంత్రివర్గం త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.