CM Revanth Reddy: ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సబ్ కమిటీ ఛైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా , ప్రత్యేక ఆహ్వానితులుగా కె.కేశవరావు ఉంటారని సీఎం వెల్లడించారు. దీపావళి తరువాత డిపార్ట్ మెంట్స్ వారీగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం తొలి మెట్టుగా భావించాలన్నారు. డీఏల విషయంలో రేపు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. 317 జీవోపై కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు.
మరోవైపు రేపు సీఎస్ ఉద్యోగ సంఘాలు వేరు వేరుగా సమావేశం కానున్నాయి. పాలనాపరంగా పరిష్కారం చేసుకునే అంశాలపై చర్చించనున్నారు. 26వ తేదీ జరిగే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించే అంశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. మా ప్రభుత్వం మీ పై కక్ష సాధింపు చర్యలకు దిగదన్నారు. కలిసి పని చేయాలన్నదే మా ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసని ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి అన్నారు. అన్నిటిని చక్కదిద్దుతూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఆదాయ వనరుల మీద మీరు కూడా ఫోకస్ చేయాలన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సీఎం రేవంత్ సమావేశమై వారికి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. మా సమస్యలు అన్నీ పరిష్కారం చేయాలని.. 2 లక్షల మందితో సభ ఏర్పాటు చేసి మీకు సన్మానం చేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ సీఎం రేవంత్‌కు తెలిపింది.