Cannabis: పంటలు సాగు చేయాల్సిన చోట గంజాయి మొక్కలు సాగు చేశాడు. పంటలు సాగు చేస్తే వచ్చే దిగుబడి అమ్మకాలకు పదో పరక వస్తుందని భావించిన మాసుల గౌస్ షోద్దీన్ గంజాయి మొక్కలను సాగు చేసి అమ్మకాలు చేపడితే లక్షలు గడించాలని ఆశపడి ఎక్సైజ్ పోలీసులకు గంజాయి మొక్కలతో గౌసోద్దీన్ పట్టుబడ్డాడు.
ఐదేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు బోరుమన్నాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లా అడిషనల్ జిల్లా న్యాయమూర్తి గౌసోద్దీన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25000 జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే… మాసుల గౌస్ సొద్ధిన్ అనే వ్యక్తి తనకున్న భూమిలో పంట సాగుకు బదులు 39 గంజాయి మొక్కలను సాగు చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న సంగారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ మధుబాబు, ఎస్సై నాగేందర్‌లు, సిబ్బంది కలిసి 2019 ఏప్రిల్ 2న గంజాయి మొక్కలపై దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తక్కడుపల్లి గ్రామంలో ఈ ఘటన 2019లో చోటు చేసుకుంది. మంగళవారం సంగారెడ్డి అడిషనల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితుడు గౌసోద్దీన్‌కు శిక్ష విధించడంతో సంగారెడ్డి ఎక్సైజ్ సీఐ నజీర్ పాషా శిక్ష పడిన వ్యక్తిని జైలుకు తరలించారు.గంజాయి సాగులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు చేపట్టినటువంటి సీఐ మధుబాబును, ప్రస్తుత సీఐ నజీర్ పాషాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి, మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అభినందించారు.