Ganesh Chaturthi Vrat Katha: ఈ రోజు దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచంలో హిందువులు ఏ మూలన ఉన్నా ఈ పండుగను జరుపుకుంటారు. హిందూ మతంలో గణేష్ చతుర్థికి చాలా ప్రాముఖ్యత ఉంది. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, ఆ రోజునే ఆయనకు గణాధిపత్యం వచ్చినందని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. గణేశుడి పుట్టిన రోజు లేద గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధచవితిని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా హిందువులు జరుపుకుంటారు. ఈ రోజున గణేషుడు ప్రతిష్టించబడి 10 రోజులు పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరుతారు. గణేష్ చతుర్థి రోజున, ఒక ఉపవాసం పాటించబడుతుందని, గణేశుడిని కూడా పూర్తి ఆచారాలతో పూజిస్తారని ఇక్కడ తెలుసుకుందాం, అయితే కథ లేకుండా ఈ ఉపవాసం అసంపూర్ణమని చెప్పబడింది. ఆ కథేంటో తెలుసుకుందాం.
శుభ సమయం:
క్యాలెండర్ ప్రకారం, గణేష్ చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5:37 గంటలకు ముగుస్తుంది. గణేష్ చతుర్థి 7వ తేదీన మాత్రమే జరుపుకుంటారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది.
గణేష్ చతుర్థి వ్రత కథ:
వినాయక వ్రతం కథ చదివేవారు, పూజలో కూర్చునే వారు ముందుగా కొద్దిగా అక్షింతలు చేతిలో పెట్టుకోవాలి. కథ ముగిసిన తర్వాత వాటిని తలపై పెట్టుకోవాలి. పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు తన దాయాదులతో మంత్ర జూదం ఆడటం వల్ల రాజ్యాన్ని కోల్పోయి ఒకరోజు తన భార్య సోదరులతో కలిసి వనవాసంలో నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ప్రజలకు అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న సూత మహాముని ధర్మరాజు కలిశాడు. తన రాజ్యాన్ని తిరిగిపొందాలంటే ఏమి చేయాలని సూత మహామునిని ధర్మరాజు అడిగాడు. అప్పుడు సూత మహర్షి వినాయక చవితి వృత్తాంతాన్ని ధర్మరాజుకు వివరించాడు. ఆ మహాముని విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణం, శాపమోక్షం గురించి సూతమహాముని వివరించాడు. రాక్షసుడు గజాసురుడు తన తపస్సుతో భగవంతుడు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకుని.. తనను ఎవరూ వధించకుండా శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో.. శివుడు అతడి ఉదరంలో బందీ అయ్యాడు. శివుడికి అలా బందీ కావడంతో జగన్మాత పార్వతీ వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పాలని కోరింది.
విష్ణువు గంగిరెద్దులను ఆడించేవారిలా, నందీశ్వరుడు గంగిరెద్దు వేషంలో వెళ్లారు. గంగిరెద్దును ఆడించి గజాసూరుడిని మెప్పించాడు. ఆ ఆనందంలో ఏం కావాలో కోరుకో అని గజాసూరుడు అడగగా.. అదే సమయం కోసం ఎదురుచూస్తున్న విష్ణువు.. నీ ఉదరంలోని శివుడిని తమ వశం చేయాలని అడిగాడు. ఈ క్రమంలో తనకు మరణం దాపురించిందని..వచ్చిన వారు దేవతలు అని గజాసూరుడు గుర్తించాడు. ఇచ్చిన మాట ప్రకారం దీనికి గజాసూరుడు అంగీకరించాడు. అప్పుడు నందీశ్వరుడు గజాసూరుడి ఉదరాన్ని చీల్చి శివుడికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సు, చర్మం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం వారంతా కలిసి కైలాసానికి బయలు దేరారు. ఆ సమయంలో భర్త రాక కోసం పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతీ దేవి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. అందమైన ఆ బాలుడిని వాకిట కాపలా ఉంచి.. జగన్మాత స్నానానికి వెళ్లింది. వెళ్లే ముందు ఎవరూ వచ్చినా లోపలికి రానివ్వొద్దు అంటూ ఆజ్ఞాపించింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన శివుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్ధానికి బయటకు వచ్చిన పార్వతీ దేవి.. ఆ ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించ ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అనంతరం గజాననుడు అనే నామకరణం చేశాడు.
ఒకానొక సమయంలో సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడిని కోరతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవరిని నియమించాలో ఆలోచించిన శివుడు.. ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో ఎవరైతే ముందుగా స్నానం చేసి తిరిగి వస్తారో వారిని సర్వవిఘ్నాలకు అధిపతిగా నియమిస్తానని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై బయలుదేరుతాడు. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందు గణేషుడు ప్రత్యక్షమవుతాడుయ అలా మూడు కోట్ల నదుల్లో ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి.. అన్న వినాయకుడికే ఆధిపత్యం ఇవ్వమని శివుడిని కోరతాడు.ఆ విధంగా విఘ్నాలకు వినాయకుడు అధిపతి అవుతాడు. ఈ కథ చదివిన ప్రతి ఒక్కరికి కష్టాలు తీరతాయి.