Pinipe Srikanth: దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్టు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేపింది. రెండేళ్ల క్రితం నాటి వాలంటీర్ హత్య కేసులో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులకు అసభ్యకరంగా మెసేజ్‌లు చేసాడనే కారణంగానే శ్రీకాంత్ కిరాయి మూకలతో హత్య చేయించాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇది రాజకీయ కక్షతో తన కుమారుడిని జైలుకు పంపుతున్నారని మాజీ మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మధురైలో అరెస్టు చేసిన శ్రీకాంత్‌ను ఇవాళ కోనసీమ జిల్లాకు తీసుకు వస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ అరెస్టు సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను డాక్టర్ ఒక డాక్టర్ ను ….ప్రాణాలు పోయడం తప్ప ప్రాణాలు తీయ్యను అనడం వైరల్ గా మారింది. మరోవైపు హత్యకు గురైన జనుపల్లి దుర్గా ప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. హత్యకు ముందు వాలంటీర్ దుర్గా ప్రసాద్ పినిపె శ్రీకాంత్‌కు సన్నిహితంగా ఉండే వాడు. మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన వ్యక్తిగత కారణంతో కిరాయి హత్య జరిగినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. శ్రీకాంత్‌ను తమిళనాడులోని మధురైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీ కార్యాలయానికి తీసుకుని వచ్చి విచారణ చేస్తారని సమాచారం.రెండేళ్ల క్రితం జరిగిన అయినవిల్లికి చెందిన అనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ అల్లర్ల సమయంలో 2022 జూన్ ఆరో తేదీన దుర్గా ప్రసాద్‌ను హత్య చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. మృతుడి కుటుంబం విన్నపం మేరకు మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో కోనసీమ జిల్లా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించారు. ఈ కేసులో మరో ముద్దాయిగా వడ్డీ ధర్మేష్‌ను మూడు రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు కోసం పోలీసులు. గాలింపు చర్యలు చేపట్టారు అయితే తన కుటుంబంపై రాజకీయ కక్షతో కుమారుడిని కేసులో ప్రధాన నిందితుడిగా చేసి అరెస్టు చేశారని మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ ఆరోపిస్తున్నారు.