HYDRA: చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్‌మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది. నగరంలో చెరువుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు.
ఈ క్రమంలో హైడ్రా చర్యలపట్ల డా. మన్సీబాల్ భార్గవ హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతోనే నగరానికి వరదముప్పు తప్పుతుందంటూ డా. మన్సీబాల్ భార్గవ సూచించారు. శరీరానికి నాడీ వ్యవస్థ ఎంత ముఖ్యమో.. చెరువులకు నాలా వ్యవస్థ అంతే అవసరమన్నారు. నాలాలు సరిగా ఉంటే.. వరద నీరు సాఫీగా చెరువుకు చేరుతుందన్నారు. అనుసంధానం ఉన్నప్పుడే ఒక దాని తర్వాత మరో చెరువు నిండుతుందన్నారు. ఆ గొలుసు తెగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వాటిని పునరుద్ధరించాలన్నారు. భారీ వర్షాలు కురవడంతో బెంగళూరులోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితులు నగరంలో తలెత్త కూడదంటే చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువులు, నాలా వ్యవస్థ సరిగా ఉండాలన్నారు.
సహజసిద్ధంగా చెరువులకు పునరుజ్జీవనం కల్పించే పద్ధతులను డా. మన్సీ బాల్ భార్గవ వివరించారు. చెరువులకు కాలువులు జీవనాడులు అని పేర్కొన్నారు. వాటిని ముందుగా పరిరక్షించుకుంటూ.. ఆ కాలువల నుంచి మంచి నీరు వచ్చేలా చూస్తే.. చెరువుల కాలుష్యం తగ్గుతుందంటూ సూచనలు చేశారు. కాంక్రీట్ కట్టడాలు కాకుండా.. సహజసిద్ధంగా చెరువులను పునరుద్ధరించినప్పడే వాటిలో జీవకళ ఉంటుందని..ఆ నీరు జీవరాసులకు ఉపయోగపడుతుందని భార్గవ చెప్పారు. ఇలా తక్కువ ఖర్చుతో చెరువులకు పునరుజ్జీవనం సాధ్యమౌతుందన్నారు.
ఆ విధానాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నెలలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే.. ఒక్క రోజులో కురిసే వర్షం ఒక గంటలో పడి నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ.. వరద నీటి కాలువలు ఎలా ఉండాలనే అంశంపై లోతైన చర్చ అవసరమన్నారు. వరద నీరు చెరువుకు చేరాలి.. చెరువులు నిండితే ఆ నీరు నదుల్లో కలవాలన్నారు. అలా కాకుండా ఆటంకాలు ఏర్పడితే నివాసాలు నీట మునుగుతాయన్నారు. చెరువులలో ఆక్రమణలు తొలగింపు.. నగరం ముంపునకు గురి కాకుండా చేసిన శస్త్ర చికిత్స లాంటిదని డా. మన్సీబాల్ భార్గవ స్పష్టం చేశారు.