Caste Census: తెలంగాణలో రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న కులగణన కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించడంతో సర్వే పూర్తయ్యేవరకు స్కూళ్లు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పాఠశాలలు ఒంటి పూట మాత్రమ పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో 85 వేల మంది పాల్గొననున్నారు. అందులో 35,559 మంది ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయులు, 3414 మంది ప్రాథమిక పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు కాగా.. మిగతా వారిలో ప్రభుత్వ మినిస్టీరియల్ ఉద్యోగులు సర్వేలో పాల్గొననున్నారు. ఈ సర్వే నుంచి ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
పార్ట్-1 యజమాని, కుటుంబ సభ్యులు
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన ప్రశ్నావళిని సర్కారు విడుదల చేసింది. ఈ ప్రశ్నావళిలో 56 ప్రధాన ప్రశ్నలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలను ఖరారు చేసింది. పార్ట్-1లో ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి 58 ప్రశ్నలు ఉండగా.. పార్ట్-2లో కుటుంబ వివరాలకు సంబంధించి 17 ప్రశ్నలున్నాయి. మొత్తం 7 పేజీల్లో వీటిని పూరించాల్సి ఉంటుంది. పార్ట్-1లో కుటుంబ వివరాలతో పాటు మతం, సామాజిక వర్గం, కులం, ఉపకులం, మాతృభాష, వైవాహిక స్థితి, విద్యార్హత, ఉద్యోగాలు, వృత్తి, ఆస్తులు, ధరణి పాస్ బుక్ నంబర్, రిజర్వేషన్ ద్వారా పొందిన ప్రయోజనాలు, లబ్ధిపొందిన సంక్షేమ పథకాల పేర్లు, రాజకీయ నేపథ్యం వివరాలను సేకరిస్తారు.
పార్ట్-2లో కుటుంబ వివరాలు నమోదు
పార్ట్-2 కుటుంబ వివరాలను నమోదు చేస్తారు. ఇందులో గత ఐదేళ్లలో తీసుకున్న రుణాలు, పశు సంపద, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు నెంబర్, నివాస గృహం రకం, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ వివరాలను తెలపాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని వెల్లడించారు. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సర్వేను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రతి 150 ఇండ్లకు 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పర్యవేక్షణ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇక గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.