TG Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకి తొలగిపోయింది. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు ఫైనల్ కీలో సరైన సమాధానాలు ఇవ్వలేదని.. ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి మరోసారి జాబితాను విడుదల చేయాలని పలువురు కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో పిటిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలపై ఆయా సబ్జెక్టుల నిపుణుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే ఫైనల్ కీని విడుదల చేశామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పరీక్షల నిర్వహణపై సర్వీస్ కమిషన్ కు తుది అధికారం ఉంటుందని కోర్టుకు వివరించింది. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే సన్నద్ధమవుతున్న అభ్యర్థులంతా నష్టపోతారని న్యాయస్థానానికి టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో ఆ పిటిషన్లును కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.