Bandi Sanjay: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను కూడా దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఈరోజు కరీంనగర్ లోని మమతా థియేటర్ లో బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన సినిమా హీరో రాకేశ్ వర్రె, దర్శక, నిర్మాతలు, సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు. అనంతరం వారితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. ” టైగర్ జితేందర్ రెడ్డి మూవీని చూసే అవకాశం కలిగింది. నేను చిన్నప్పుడు చదువుకునే సమయంలో దేశం కోసం బలిదానాలు చేసిన ఏబీవీపీ విద్యార్థుల చరిత్రను తెలుసుకున్న. వాళ్ల త్యాగాలు వ్రుధా కాకుండా దేశం కోసం పనిచేయాలని నేను కూడా ఏబీవీపీలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన. ఆనాడు ఒక్క కార్యకర్త బలిదానమైతే… వందల మంది కార్యకర్తలు పుట్టుకొచ్చారు. జితేందర్ రెడ్డి బలిదానంతో వేలాది మంది పుట్టుకొచ్చారు. నక్సలైట్లు చంపుతారని తెలిసినా ఏనాడూ ఏ కార్యకర్త భయపడలేదు. నమ్మిన సిద్ధాంతం, ధర్మం కోసం పోరాడిన చరిత్ర ఏబీవీపీదే. దేశంలో ఏ నాయకులు జాతీయ జెండా కోసం బలిదానం కాలేదు… జాతీయ జెండా కోసం బలిదానమైన వ్యక్తులు మిలటరీ సైనికులు.
ఏబీవీపీ కార్యకర్తలు మాత్రమే. జితేందర్ రెడ్డి బాడీలో బుల్లెట్లు దిగిన తరువాత ‘భారత్ మాతాకీ జై’ నినాదం. అంత గొప్ప వ్యక్తి చరిత్రను సినిమాగా నిర్మించడం గొప్ప విషయం. జితేందర్ రెడ్డి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తే రక్తం కంటే బుల్లెట్లే ఎక్కువ బయటపడ్డాయని ఆనాడు డాక్టర్లు చెప్పారంటే… అర్ధం చేసుకోండి. ఆనాడు జితేందర్ రెడ్డి, సామ జగన్ మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, జయానంద్ మాదిరిగా వేలాది మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. రవీందర్ రెడ్డి చొరవ, మంచి ఆలోచనవల్ల ఇయాళ జితేందర్ రెడ్డి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపడం అద్రుష్టంగా భావిస్తున్నాం. అనేక కార్యకర్తలకు, ప్రజలకు స్పూర్తినిచ్చే సినిమా.
ప్రతి ఒక్కరూ జితేందర్ రెడ్డి మాదిరిగా దేశం కోసం, ధర్మం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. జితేందర్ రెడ్డి స్పూర్తితోనే మాలాంటి ఎందరో కార్యకర్తలుగా మారి పోరాటాలు చేస్తున్నారు. మంచి ఆలోచనలున్న ప్రతి ఒక్కరూ, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్లంతా జితేందర్ రెడ్డి సినిమాను చూడాలని కోరుతున్నా. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ, టెక్నీషియన్లకు జాతీయ వాదులందరి తరపున క్రుతజ్ఝతలు తెలియజేస్తున్నా.” అని పేర్కొన్నారు.
“దురద్రుష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఇయాళ మావోయిస్టు భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించడం సిగ్గు చేటు. నక్సలైట్ భావజాలమున్న వారివల్లే ఎంతో మంది జితేందర్ రెడ్డి లాంటోళ్లు చనిపోయారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ సంకేతాలు పంపుతోంది? నక్సలైట్ల చేతిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బలైపోయారు.
విద్యా కమిషన్ లో నక్సలైట్ భావజాలమున్న వాళ్లను విద్యా కమిషన్ లో చోటు కల్పించడం ద్వారా వారి త్యాగాలను కూడా వ్రుధా చేశారు. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదు… జాతీయ వాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్లంతా నూతన విద్యా కమిషన్ ను రద్దు చేయాలని కోరుతున్నా. రేవంత్ సర్కార్ కూడా తక్షణమే కమిషన్ ను రద్దు చేసి కొత్త వారికి ఛైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరుతున్నా.
అబద్దాలంటేనే కాంగ్రెస్ పార్టీ. మోసాలు, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. మహారాష్ట్రకు పోయి అబద్దాలు చెప్పడం కాదా? తెలంగాణలో తిరిగి ఆ విషయాలు చెప్పే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ నిజంగా 6 గ్యారంటీలను అమలు చేసి ఉంటే.. కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో ఇచ్చిన యాడ్స్ లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు? ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అమలు చేశామని చెప్పిన రేవంత్ రెడ్డి… ఇంకా 20 లక్షల మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదని చెప్పే దమ్ముందా? మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500లు, నిరుద్యోగులుకు రూ.2 లక్షల మాఫీ, విద్యార్థులకు రూ5 లక్షల భరోసా కార్డు, వ్రుద్దులకు నెలనెలా రూ.4 వేల ఫించన్, పేదలందరికీ ఇండ్లు ఇచ్చారా? ఇవేమీ అమలు చేయకుండా మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గు చేటు… మేం కూడా మహారాష్ట్రలో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతాం.” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
“6 గ్యారంటీలు, రుణమాఫీపై నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అందుకే నివేదికను బయటపెట్టేందుకు కూడా రేవంత్ సర్కార్ వెనుకాడుతోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో కర్రు కాల్చి వాతపెట్టారు.
ఈసారి మహారాష్ట్రలో కూడా అదే జరగబోతోంది.బీజేపీపై యుద్దం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు.. దేనికోసం యుద్దం చేస్తారు? ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకా? 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చినందుకా? ట్రైబల్ వర్శిటీ ఇచ్చినందుకా? ట్రిబుల్ ఆర్ రోడ్డుకు నిధులు ఇస్తున్నందుకా? స్మార్ట్ సిటీ నిధులు ఇస్తున్నందుకా? గ్రామాలకు నిధులు ఇస్తున్నందుకా? జాతీయ రహదారుల కోసం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నందుకా?. కేసీఆర్ సర్కార్ తెలంగాణలోని ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయలకు పైగా అప్పు చేసి దోచుకుంటే… కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేస్తూ ప్రజలను బిచ్చగాళ్లను చేస్తోంది.
తెలంగాణలో ప్రజలు కేసీఆర్ ను ప్రజలెప్పుడో మర్చిపోయారు. అందుకే ఫాంహౌజ్ కే పరిమితమైండు. ఎన్నికలప్పుడే బయటకొచ్చే కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ సమాజం లీడర్ గా భావించదు. వరదలొస్తే బయటకు రాలే. రైతులు అరిగోస పడుతుంటే రాలే. నిరుద్యోగులు రోడ్డున పడితే రాలే.. 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేస్తే రాలే.. కానీ కేటీఆర్ బామ్మర్థి రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తడు… తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇక ఎన్నడూ నమ్మదు. కేసీఆర్ పాలనను తలుచుకుంటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయ్. కాంగ్రెస్ కూడా అంతకుమించి దారుణమైన పాలన చేస్తోంది. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్లయింది. ఈసారి అందుకే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేసి గెలిపించేందుకు సిద్ధమయ్యారు.” అని బండి సంజయ్ అన్నారు.