Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియచేయడం శుభపరిణామమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రూ.2,245 కోట్ల నిర్మాణ వ్యయంతో 57 కిమీ మేర ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాజధానికి వచ్చే ప్రజలకు, అధికారులు, ఉద్యోగులకే కాదు అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వర స్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు సందర్శనకు వచ్చేవారికి ఈ రైల్వే లైన్ అనువుగా ఉంటుందన్నారు. వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ రైలు మార్గం కచ్చితంగా రాష్ట్రాభివృద్ధికి క్రియాశీలకంగా మారబోతోందన్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కొత్త రైలు మార్గం అనుసంధామయ్యేలా ఉంటుంది కాబట్టి ఈ రైలు మార్గం వెంబడి పారిశ్రామిక పురోగతి జరుగుతుందన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. పర్యావరణహితంగా, 6 కోట్ల కేజీల కర్బన ఉద్గారాలు తగ్గించే విధంగా నిర్మితమవుతోందని పవన్ తెలిపారు. ఇన్ని కోట్ల కేజీల కర్బన ఉద్గారాలు తగ్గించడం అంటే 25 లక్షల చెట్లు పెంచినట్లేనన్నారు. ఈ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా 19 లక్షల పని దినాలు కల్పించే అవకాశం లభించడం గొప్ప విషయమన్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కి ఎలాంటి విఘాతం లేకుండా అధునాతన పరిజ్ఞానంతో రైల్వే లైన్ నిర్మాణం కాబోతుందన్నారు. అమరావతి రైల్వే లైన్ కచ్చితంగా మోడల్ రైలు మార్గంగా నిలుస్తుందన్నారు. బహు ముఖ ప్రయోజనం కలిగిన నూతన రైలు మార్గాన్ని సాధించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియచేస్తున్నామని పవన్ పేర్కొన్నారు.