Actress Kasturi: గత రెండు రోజులుగా తనకు చాలా బెదిరింపులు, దాడులు వచ్చాయని తమిళ బీజేపీ నేత, ప్రముఖ నటి కస్తూరి పేర్కొన్నారు. అవి తన సంకల్పాన్ని మరింత పెంచాయన్నారు.
తాను నిజమైన జాతీయవాదినని అన్నారు. తాను ఎప్పుడూ కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించానని పేర్కొన్నారు. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం తన అదృష్టమన్నారు. తెలుగు వారు పేరు, కీర్తి, ప్రేమను అందించారని అన్నారు.
తాను వ్యక్తీకరించిన అభిప్రాయాలు కొందరిని మాత్రమేనని…. అందరినీ అనలేదన్నారు. తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు.మీ మనసును బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరారు. 3వ తేదీన మాట్లాడిన తన ప్రసంగంలో తెలుగుకు సంబంధించిన అన్ని మాటలను ఉపసంహరించుకుంటున్నానన్నారు. వచ్చిన వివాదం తాను ఆ ప్రసంగంలో లేవనెత్తిన ముఖ్యమైన అంశాల నుంచి దృష్టిని మళ్లించిందన్నారు.
తాజాగా ఓ రాజకీయ ప్రసంగంలో కస్తూరి మాట్లాడుతూ.. రాజుల కాలంలో అంతఃపుర మహిళలక సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన సీనియర్ నేతలు అర్జున్ సంపత్, గురుమూర్తి నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే… మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యల వివాదంపై క్లారిటీ ఇచ్చింది.