Prakash Raj: మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, సినీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ట్విట్టర్ లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్ ను పంచుకున్నారు. “ఏంటి సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా?..” అని ఎక్స్(ట్విట్టర్)లో రాసుకొచ్చారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్ రాజ్ ఈ విధంగా స్పందించారు.
కొండా సురేఖ కేటీఆర్ పై ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. “నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి, ఇండస్ట్రీని వదిలిపెట్టి పోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్ కు అలవాటు పడి రేవ్ పార్టీలు చేసుకొన్నారు. మదమెక్కి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి వారి లైఫ్ ను నాశనం చేశారు. అంతే కాకుండా గతంలో అక్రమంగా కట్టిన ఎన్ కన్వెన్షన్ ను చూసి చూడనట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసింది. సమంతను కేటీఆర్ రమ్మని పిలిచాడు. నాగార్జున కుటుంబం కూడా వెళ్లమని ఒత్తిడి చేసింది. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో సమంత విడాకులు తీసుకుంది.” అని కొండా సురేఖ అన్నారు. కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి.