Electric Bike Battery: రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం అందిస్తుడడంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. తరచుగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలిన సంఘటనలు జరుగుతుండడంతో కొనుగోలుదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం బాల పల్లి గ్రామంలో ఎలక్ట్రిక స్కూటర్ బ్యాటరీ పేలిన ఘటన చోటుచేసుకుంది
చార్జింగ్ పెట్టిన బ్యాటరీ బైక్ పేలిన ఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో జరిగింది. బాలపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి 3 నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బ్యాటరీ బైక్ కొనుగోలు చేశాడు. ఉదయం ఇంటి కాంపౌండ్ లోపల ప్రధాన ద్వారానికి పక్కన చార్జింగ్ పెట్టాడు.అకస్మాత్తుగా బ్యాటరీ పేలడంతో ఇంటి తలుపులు, కిటికీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మూడు నెలల క్రితమే కొనుగోలు చేసిన కొత్త బైక్ ఈ విధంగా పేలుతుందని ఊహించలేదంటూ తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్జింగ్ పెట్టిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.