గొట్టిపాటి రవి కుమార్: జగన్పై ఘాటుగా స్పందించిన విద్యుత్ శాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లతో ప్రజలను మభ్యపెట్టడం జగన్ తరహా రాజకీయమని ఆయన ఎద్దేవా చేశారు. “జగన్ రెడ్డి విద్యుత్ రంగంపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది,” అంటూ సెటైర్లు వేశారు.
రూ. 20 వేల కోట్ల ట్రూప్ అప్ చార్జీల ప్రతిపాదన జగన్ పాపమే!
జగన్ మోహన్ రెడ్డి టిడిపి ప్రభుత్వంపై రూ. 18 వేల కోట్ల విద్యుత్ బకాయిలను మోపారని విమర్శించడం పై స్పందించిన మంత్రి రవి కుమార్, “తమ ప్రభుత్వ హయాంలో రూ. 20 వేల కోట్ల ట్రూప్ అప్ చార్జీల ప్రతిపాదనను ఏపీఈఆర్సీకి పంపింది జగన్ ప్రభుత్వమే. వైసీపీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా పాడైపోయింది,” అని మండిపడ్డారు.
విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారు
“జగన్ తన పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం తాగారు. ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోలేరు. ఇలాంటి వ్యక్తి విద్యుత్ రంగంపై మాట్లాడటానికి అర్హత ఏమిటి?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
అసెంబ్లీలో పోరాడలేక ప్రెస్ మీట్లు!
గొట్టిపాటి, అసెంబ్లీ వేదికపై ప్రజా సమస్యలపై చర్చించలేక, జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం రాజకీయ దుర్మార్గమన్నారు. “ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వీరి పాలనలో ఎలాంటి కృషి చేయలేదు. ఐదేళ్ల పాలనలో ఈ ప్యాలెస్ నుండే అన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. అందుకే ప్రజలు జగన్ను ప్యాలెస్కే పరిమితం చేశారు,” అని వ్యాఖ్యానించారు.
విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు
విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని మంత్రి ప్రశంసించారు. “విద్యుత్ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చి, దీన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. కానీ వైసీపీ మాత్రం విమర్శలు చేయడానికే పరిమితం అవుతోంది,” అని విమర్శించారు.
ఇకనైనా ప్రజా సమస్యలపై పోరాడండి
గొట్టిపాటి రవి కుమార్, వైసీపీ నేతలు ఇకనైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “ప్రజా సమస్యలను పక్కనపెట్టి, రాజకీయ లబ్ది కోసం మాట్లాడటం ఆపండి. ప్రజల కోసం పనిచేయండి,” అని సూచించారు.
వైసీపీ పాలనపై విమర్శలు
గొట్టిపాటి వ్యాఖ్యలు వైసీపీ పాలనలో ఉన్న లోపాలను, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రజలు తమకు తగిన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా కొత్త మార్గాలు తీసుకురావాలని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.