Amaran: కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు 250కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ 300 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకువెళ్తుంది. కమల్ హాసన్ నిర్మాణంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ భారతీయ సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ తెరకెక్కిన ఈ చిత్రంలో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటించగా, ముకుంద్ సతీమణి పాత్రలో సాయిపల్లవి మెప్పించారు. అన్నిచోట్ల మంచి రెస్పాన్స్ వస్తున్న ఈ మూవీకి తమిళనాడులో చేదు అనుభవం ఎదురయ్యింది.
తమిళనాడులో తిరునెల్వేలి జిల్లాలో ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్ వద్ద చర్చనీయాంశంగా మారిన ఘటన చోటుచేసుకుంది. ఈ థియేటర్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. దాడి ఘటనపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని, ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాకపోవడం విశేషమని పేర్కొన్నారు. స్థానిక వ్యక్తుల మధ్య గొడవలే ఈ దాడికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటన థియేటర్ వద్ద సందడి చేస్తున్న సినీ ప్రియులను కాస్త కలవరపాటుకు గురిచేసింది.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. శివకార్తికేయన్ మరియు సాయిపల్లవి నటనపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి నటన క్లైమాక్స్‌లో ప్రేక్షకుల మనసులను కదిలించింది, వాటికీ తోడు జీవీ ప్రకాశ్ సంగీతం కంటతడి పెట్టేలా చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించకుండా, స్క్రిప్ట్‌పై నమ్మకంతో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమరన్ చిత్రంపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ తమకు చాలా ఆనందాన్ని ఇస్తోందని చిత్రబృందం పేర్కొంది.