Home » Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌కు పెరిగిన కష్టాలు!.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విచారణకు ఆదేశం

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌కు పెరిగిన కష్టాలు!.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విచారణకు ఆదేశం

Ola Electric: దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి కష్టాలు పెరిగాయి. IPO రేట్లలో నిరంతర క్షీణత మధ్య ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీసింగ్ నాణ్యత తక్కువగా ఉందని ఆరోపించిన విషయంలో నిరంతరం వివాదాల్లో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు పెద్ద ఇబ్బందుల్లో పడింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఓలా ఎలక్ట్రిక్ యొక్క సర్వీసింగ్, ఈ-స్కూటర్‌లో లోపాలపై దర్యాప్తునకు ఆదేశించింది.


ఓలా మీద ఉచ్చు బిగించిన సీసీపీఏ
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ల విక్రయం తర్వాత సర్వీస్‌కు సంబంధించిన ఫిర్యాదులు, బైకులలో లోపాలపై వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ సీసీపీఏ వివరణాత్మక విచారణకు ఆదేశించింది. నిధి ఖరే నేతృత్వంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఈ అంశంపై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్)ని ఆదేశించింది. ఖరే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి కూడా ఛైర్మన్ గా ఉన్నారు.


నవంబర్ 21 నాటికి సవివర నివేదిక
ఓలా ఎలక్ట్రిక్‌కు సంబంధించిన అంశానికి సంబంధించి నవంబర్ 6న ఉత్తర్వులు వెలువడగా, 15 రోజుల్లోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని బీఐఎస్ డైరెక్టర్ జనరల్‌ను కోరింది. ఈ నోటీసుపై కంపెనీ స్పందించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 15 రోజుల్లోగా ఈ విషయాన్ని సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని CCPA ఇప్పుడు DG (ఇన్వెస్టిగేషన్)ని కోరింది.


నోటీసుకు సమాధానం ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో 10,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన తర్వాత సీసీపీఏ ప్రారంభించిన చర్యను దృష్టిలో ఉంచుకుని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సమాధానమిచ్చింది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, తప్పుదారి పట్టించే ప్రకటనలు,అన్యాయమైన వాణిజ్య విధానాలను పేర్కొంటూ రెగ్యులేటర్ అక్టోబర్ 7న ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 21న కంపెనీకి నోటీసు ఇవ్వగా.. అందులో సీసీపీఏ వద్ధ దాఖలైన 10,644 ఫిర్యాదులలో 99.1 శాతం పరిష్కరించబడినట్లు ఓలా కంపెనీ నోటీసులకు సమాధానం ఇచ్చింది.


ఇప్పటికీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యధిక విక్రయాలు
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అని, గత అక్టోబర్‌లో 40 వేలకు పైగా స్కూటర్లను విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69,999 నుండి మొదలై రూ. 1.20 లక్షల వరకు ఉంటుంది. లుక్స్, ఫీచర్లతో పాటు, బ్యాటరీ రేంజ్ పరంగా కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విక్రయాలను కూడా ప్రారంభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *