Patnam Narender Reddy: రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లగచర్ల ఘటన నేపథ్యంలో కేబీఆర్ పార్క్ వద్ద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ లగచర్ల ఘటనలో పట్నం నరేందర్రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా, సంభాషణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. లగచర్ల సంఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ఎవరితోనైనా మాట్లాడారా ? మాట్లాడిన వారు ఎవరు ? అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ ఎవరి ప్రోద్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు.. అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వం, పోలీస్ శాఖ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకునన్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా భూ సేకరణ కోసం అధికారులు సమయాత్తం అవుతున్నారని, ప్రధాన నిందితుడు సురేష్ కావాలని కలెక్టర్ ను మాయమాటలు చెప్పి గ్రామంలోకి తీసుకొని వెళ్లారన్నారని ఐజీ సత్యనారాయణ తెలిపిన సంగతి తెలిసిందే.
చేతగాని పాలనకు నిదర్శనం: కేటీఆర్
మరోవైపు పట్న నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్ఎస్ కీలక నేతలు మండిపడుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసిందని అన్నారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం: మాజీ మంత్రి హరీష్ రావు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా అంటూ ప్రశ్నించారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అంటూ అడిగారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని.. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని.. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామన్నారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.