Harish Rao: మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి,చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లు పాల్గొన్నారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నామన్నారు. తెలంగాణకు జరుగుతున్నా అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేపట్టామన్నారు. ఎన్నికల్లో చెప్పని ఎన్నో పథకాలు రైతుల కోసం కేసీఆర్ పెట్టారని వెల్లడించారు. రైతుల సీఎం కేసీఆర్ నిలిస్తే.. భూతుల సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచారని హరీష్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అని మహారాష్ట్రలో రేవంత్ చెప్తున్నాడని.. అందరిని మోసం చేసి మహారాష్ట్రలో అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మోసం చేశాడని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని అడిగితే దేవుళ్ళ మీద ఓట్లు పెట్టాడన్నారు. దేశంలో దేవుణ్ణి మోసం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక గ్యారెంటీలకు, బాండ్ పేపర్లకు విలువ లేకుండా పోయిందన్నారు. ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ ఓట్లను డబ్బాలో వేసుకుందన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ వాళ్లు వమ్ము చేశారన్నారు. 100రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారని అన్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే కొంచమైనా రుణమాఫీ అయిందన్నారు. పంద్రాగస్టు రుణమాఫీ చేస్తానని నాతో ఛాలెంజ్ విసిరారని అన్నారు. వాయిదాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శించారు. మూసీ మురికికి కారకులు కాంగ్రెస్, టిడిపి నేతలు అని ఆయన ఆరోపించారు.నీ సవాల్ కు నేను రేడి.. ఎక్కడ ఇండ్లు కూలగొడితే అక్కడ నుంచి పాదయాత్రకు సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. రేవంత్ ది తిట్లు అయితే బిఆర్ఎస్ ది కిట్ల సర్కార్ అంటూ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా రైతుబంధు ఇవ్వలేదన్నారు. మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపు ఎక్కువగా ఉందన్నారు. మాటలు కాదు.. ప్రజలకు చేతలు చూపించు అంటూ చురకలు అంటించారు. రైతుల ధాన్యం ఎప్పుడూ కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. కల్లాల వద్దకు సీఎం, మంత్రులు రావాలి.. రైతుల గోస తెలుస్తుందన్నారు. రైతు భరోసా ఇచ్చే దాక కాంగ్రేసోళ్లను నిలదీయాలన్నారు. రైతులు రోడ్ల మీద.. మంత్రులు గాలిమోటార్లలో గాలిలో తిరుగుతూ విహార యాత్రలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ అర్థమైంది.. మహారాష్ట్రలోనూ ఓటమి తప్పదన్నారు. నమ్మి కాంగ్రెస్ కు ఓటేస్తే మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ అన్నారు.