Minister Ponguleti Srinivas Reddy: రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన 27 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. మిగిలిన 13వేల కోట్ల రుణమాఫీని కూడా అర్హులైన రైతులకు అందజేస్తామని వెల్లడించారు. డిసెంబర్ చివరిలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలకు చెప్పిన హామీలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మంత్రి అన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని మంత్రి తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యువతకు 57వేల ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇప్పటికే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించామని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం పథకాలను అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానన్న హామీని కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.