Home » CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు..

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం

CM Revanth Reddy: మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైలో ప్రెస్‌మీట్‌ సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని విమర్శించారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానన్నారు. దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయన్నారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారన్నారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామన్నారు. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలంగాణ రైతుల విషయంలో మోడీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామన్నారు. ఆ తరువాత ఆయన తన ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారన్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామన్నారు. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని తెలిపారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించిందన్నారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం పేర్కొన్నారు. 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. మోదీని డిమాండ్ చేశామన్నారు.

దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని.. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారన్నారు. ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్ కు తరిలించుకొని పోయారన్నారు. మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *