KTR: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు అమానుషంగా దాడి చేయటంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే అంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే…మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తామన్నారు. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు.
ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిపై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని అన్నారు మొన్న ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గాంధీ తో గుండాగిరి చేయించి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశాడన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డి పై ఈసారి పోలీసుల ద్వారానే రేవంత్ రెడ్డి దాడి చేయించాడని ఆరోపించారు. ప్రశ్నిస్తే భయపడి దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులెవరు భయపడ్డారన్నారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.