Rahul Gandhi: హైదరాబాద్‌లో కులగణన సంప్రదింపుల సదస్సులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కుల వివక్షతపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలలో ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలు పనిచేస్తున్నారని అడిగారు. ఆదివాసీలు మీడియా రంగంలో ఎంత మంది ఉన్నారని.. ఈ ప్రశ్నలను పదేపదే మోడీని అడిగితే తాను దేశాన్ని విడగొట్టినట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కులగణన వలన దేశంలో ఒక మంచి పరిపాలన అందించడానికి అవకాశం ఉందన్నారు. ఈ భూ మండలం మీద ఎక్కువ కుల అసమానతలు ఉన్న దేశం భారతదేశం అని వెల్లడించారు. అసమానతుల గురించి ప్రపంచంలోనే ఒక ఆర్థిక నిపుణుడితో మాట్లాడానని.. అసమానతలకు భారతదేశం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని తెలిపారని వెల్లడించారు. ఈ విషయంపై ఆర్థిక నిపుణుడిని పలు ప్రశ్నలు అడిగానని.. దేశంలో నెలకొన్న అసమానతలకు ప్రధాన కారణం కుల వివక్ష అని చెప్పారని తెలిపారు. ఈ దేశంలో ఇంకా ఒక దళితుడిని అంటరానివాడిగా చూస్తూ ముట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఈ రకమైన వర్గ వివక్ష ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.
టైటానిక్ పడవను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారని.. కానీ సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని 20 నిమిషాలలో మునిగిపోయిందన్నారు. ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించిందన్నారు. మిగతా అంత లోతుగా ఉండి బయటకు కనిపించింది అది తెలియక ఆ పడవ కుప్ప కూలిందన్నారు. అలాగే నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉందన్నారు. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందన్నారు. మేము దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నామన రాహుల్ గాంధీ తెలిపారు. అందుకే కులగణన అనేది అత్యంత కీలకమన్నారు. కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు.. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుసుకోవాలన్నారు. ఏదైనా వ్యాధి తెలియాలంటే పరీక్ష చేయాలి కదా అంటూ వ్యాఖ్యానించారు. మేము కుల గణన చేసి ఎవరికి ఏముందో తెలుసుకుందాం అంటే ప్రధాని మోడీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారని.. దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా అంటూ ప్రశ్నించారు. మేము దేశవ్యాప్తంగా కులగణన చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ కులగణన చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దన్నారు. ప్రజల నుంచి వారి ఆలోచినలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలన్నారు. తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారన్నారు. వివక్ష తొలగించి అందరికి అందరికి సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.