US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాతృభూమి అయిన తులసేంద్రపురం గ్రామంలో పూజలు, వేడుకల వాతావరణం నెలకొంది. వాషింగ్టన్కు 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్పబిడ్డ” అంటూ పోస్టర్ ను ఏర్పాటు చేశారు. కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ ఈ గ్రామంలోన జన్మించారు. ఆమె తల్లి 19 ఏళ్ల వయస్సులో వైద్య విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లారు. గోపాలన్ కుమార్తె శ్యామలా గోపాలన్ చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఆమెకు జమైకన్ మూలానికి చెందిన డోనాల్డ్ జె. హారిస్‌తో వివాహం జరిగింది. దీని తరువాత, కమల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారు.
కమలా హారిస్ కోసం ప్రార్థన
కమల గెలుపు కోసం మంగళవారం ఉదయం గ్రామ దేవాలయంలో ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేశారు. గుడి దగ్గర దుకాణం పెట్టుకునే జి మణికందన్ మాట్లాడుతూ.. కమల ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో చాలా రోజుల పాటు ఘనంగా వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ గ్రామం పేరు చర్చలోకి వచ్చింది. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ట్రంప్, హారిస్ మధ్య గట్టి పోటీ
అమెరికాలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు నవంబర్ 5న ఓటింగ్ ప్రారంభమవుతుందని, అర్థరాత్రికి అక్కడ తదుపరి అధ్యక్షుడెవరో నిర్ణయించబడుతుందని తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం భారత సంతతికి చెందిన వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా దేవి హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యే నెలకొంది.