Actress Kasthuri: తాను తెలుగు వారిని అవమానించలేదని నటి కస్తూరి స్పష్టం చేశారు. ఆమె తెలుగువారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తమిళనాడులో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అక్కడి స్థిరపడిన తెలుగువారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలు వైరల్ కాగా.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ పోస్ట్లు పెట్టారు.
తన వ్యాఖ్యలను డీఎంకే నేతలు వక్రీకరించారని.. తాను తెలుగు జాతి గురించి తప్పుగా మాట్లాడలేదని.. ద్రావిడవాదుల గురించి మాత్రమే అడిగానన్నారు. తాను తెలుగు వారిని ఒక్క మాట అనలేదన్నారు. ద్రావిడవాదుల గురించి మాత్రమే మాట్లాడానన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులు ఉన్నారని మాత్రమే చెప్పానన్నారు. తెలుగు తన మెట్టినిల్లు అని, తెలుగు వారంతా తన కుటుంబం అని చెప్పారు. తెలుగు ప్రజలు ప్రేమను, అభిమానాన్ని చూపుతున్నారన్నారు. ఇది తెలియని వారు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తెలుగు నుండి తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి… వస్తున్నాయని వెల్లడించారు. డీఎంకే నేతలు తెలుగు వారిని అవమానపరుస్తున్నారని, అందుకే వారిని ప్రశ్నించాను…దానికి తనపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. తాను మాట్లాడింది కొందరిని ఉద్దేశించి మాత్రమేనని చెప్పారు. కానీ చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించి.. నాపై వ్యతిరేకత తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోందన్నారు. డీఎంకే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని నటి కస్తూరి పేర్కొన్నారు.
తాజాగా ఓ రాజకీయ ప్రసంగంలో కస్తూరి మాట్లాడుతూ.. రాజుల కాలంలో అంతఃపుర మహిళలక సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన సీనియర్ నేతలు అర్జున్ సంపత్, గురుమూర్తి నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే… మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ వ్యాఖ్యల వివాదంపై క్లారిటీ ఇచ్చింది.