Minister Gottipaati Ravi kumar: రోడ్ల అభివృద్ధి ద్వారా మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని చినఅమిరం కూడలిలో ‘గుంతలు లేని రోడ్లు ఏర్పాటు’కు కొబ్బరికాయ కొట్టి పనులను జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా పెద్ద పెద్ద గోతులతో ప్రయాణానికి వీలులేని విధంగా తయారయ్యాఆన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే రోడ్లను అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను గుంతలు లేకుండా రోడ్డుకు సమాంతరంగా మరమ్మత్తులు చేపట్టేందుకు ఈరోజు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి రాష్ట్రంలోని రోడ్లు గుంతలను పూడ్చే మరమ్మతుల పనులకు రూ.800 కోట్లు పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
రాబోయే రోజులలో జిల్లాకు సంబంధించి రాజకీయంగా అభివృద్ధి పరంగా కూటమి ప్రభుత్వంతో కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో రూ.1,699 లక్షల రూపాయల వ్యయంతో ఏడు నియోజకవర్గాల్లోని 74 రోడ్ల మరమ్మత్తులకు నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని, రానున్న వారం రోజుల్లో రూ.3,125 లక్షల వ్యయంతో మరో 114 రోడ్లకు మరమ్మత్తులను సంక్రాంతి నాటికి పనులు పూర్తిచేసే లక్ష్యంతో చేపట్టడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా మెరుగైన రహదారి వ్యవస్థ ఉండాలన్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం వలన ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసలతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
వాహనాలు పాడైపోవడం, రోజూ ప్రయాణం చేసే వారికి రోడ్లు కారణంగా వెన్నుముక అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రజలు శారీరకంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మెరుగైన పాలనా అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని దీనికి ప్రజల మద్దతు అవసరం అన్నారు.
ఇప్పటికే పింఛన్లను ఎక్కువ మొత్తంలో పెంచి అందిస్తున్నామని, మహిళలకు ఆసరాగా ఉచితంగా మూడు సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయి రహదారుల ఏర్పాటుతోపాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి,, ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా రహదారులు భవనాల శాఖ అధికారి ఏ శ్రీనివాస్, డి ఈ ఈ పి.వి రామరాజు, ఏఈ రాజశేఖర్, తహసీల్దార్ రావి రవికుమార్, స్థానిక నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.