Home » Cheviti Venkanna: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

Cheviti Venkanna: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి..

Cheviti Venkanna: తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రేవంత్ సర్కారు సిద్ధమైన సంగతి తెలిసిందే. నవంబర్‌ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఈ సర్వేతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోతోంది. ఇందులో ఇంటింటికీ అధికారులు వెళ్లనున్నారు. కుటుంబ వివరాలు తెలుసుకుంటారు. ఈ సర్వే గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధిష్ఠానం ఆదేశాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో నవంబర్ 6వ తేదీ నుంచి నిర్వహించే సమగ్ర ఇంటింటి‌ కుటుంబ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సర్వేను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షులు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్ అన్నారు‌.

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే , డీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల, బడుగుల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చిందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో సమగ్ర కుల గణన చేస్తామని హామీ ఇచ్చారని, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, వరంగల్ సభలో ఇచ్చిన హామి రైతు డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సమగ్ర కుల గణన సర్వేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయడానికి వచ్చిన ఎన్యుమరేటర్‌లకు సహకరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ కులం నమోదు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సర్వే చాలా ముఖ్యమైనదని, సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *